Minister Satya Kumar Yadav Review on Seasonal Diseases : సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా వ్యాధుల పటిష్ట నియంత్రణకు అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. జ్వరాల నియంత్రణపై పర్యవేక్షించేందుకు నిపుణుల కమిటీని మంత్రి సత్యకుమార్ ఏర్పాటు చేశారు. సీజనల్ వ్యాధులపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియాతో రాష్ట్రంలో ఎవరూ చనిపోకూడదని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు వారానికి ఒకసారి జ్వరాలు, సీజనల్ వ్యాధులపై సమీక్షించాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు.
విష జ్వరాల నియంత్రణపై కమిటీ ఏర్పాటు : జ్వరాల నియంత్రణపై పర్యవేక్షించేందుకు నిపుణుల కమిటీని మంత్రి సత్యకుమార్ ఏర్పాటు చేశారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ సి.హరికిరణ్ ఛైర్మన్‌గా వ్యవహరించే కమిటీలో పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లు, ఐటీడీఏ పాడేరు పీవో, మైక్రోబయాలజిస్ట్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ నిపుణుడు, మరో ఇద్దరు వైద్య నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి మెంబర్ కన్వినర్‌గా వ్యవహరిస్తారు.
సీజనల్ వ్యాధులపై పర్యవేక్షణ వ్యవస్థ : మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. కేసులను గుర్తించడం, రిఫర్ చెయ్యడం, చికిత్స అందించడం, తరచూ విజిట్ చేయడం వంటి పనులను నిపుణుల కమిటీ చేపడుతుందని మంత్రి తెలిపారు. పారిశుద్ధ్యం, ఫాగింగ్ వంటి విషయాల్లో స్థానిక నేతల సాయాన్ని తీసుకోవాలని మంత్రి సూచించారు. విష జ్వరాలు, సీజనల్ వ్యాధులపై సమర్థవంతమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.
వ్యాధులు ప్రబలిన వెంటనే అప్రమత్తంగా ఉండాలని, విష జ్వరాలను కట్టడి చేయాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. కేసులు వచ్చిన వెంటనే కలెక్టర్ల దృష్టికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తీసుకెళ్లాలన్నారు. అన్ని సబ్ సెంటర్లు, పీహెస్సీలు, యూపీహెచ్సీల పరిధిలో ప్రబలిన జ్వరాల్ని ప్రతిరోజూ రిపోర్టు అందించాలన్నారు. ప్రస్తుత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాదికి మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అన్ని అవయవాలపై ప్రభావం - మాయదారి జ్వరంతో జనం బెంబేలు - Viral Fevers Spreading in AP