MUSI RIVERFRONT DEVELOPMENT PROJECT : మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నాయని రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇవాళ సిద్దిపేటలోని ఓ హోటల్‌లో నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని మూసీ నదికి ఇరువైపులా నివాసం ఉన్న వారిని బలవంతంగా ఖాళీ చేయించడం లేదని, వారి అంగీకారంతోనే ముందుకు సాగుతామని వెల్లడించారు.
సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం : మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోందని మంత్రి పొన్నం తెలిపారు. తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని ఆయన సూచించారు. మూసీ బాధితులకు ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇస్తున్నామని, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఆదుకుంటామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలది మంచి పద్దతి కాదని, మూసీని మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి చూపిస్తామని పేర్కొన్నారు.
ప్రతిపక్షాల రాజకీయం : మూసీ బాధితుల పట్ల హరీశ్ రావు లాంటి నాయకులు రాజకీయం చేస్తున్నారని మంత్రి పొన్నం మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లన్నసాగర్ నిర్వాసితులను లాఠీలతో అణచివేశారని మంత్రి పొన్నం దుయ్యబట్టారు. అధికారం లేదని బీఆర్ఎస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మూసీ నిర్వాసిత కుటుంబాల జీవితాలతో ప్రతిపక్షాలు ఆడుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రజా సమస్యలపై నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు.
హైదారాబాద్ తెలంగాణకు గుండె కాయ వంటిదని, హైదరాబాద్‌లో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలపై దృష్టి సారించినట్లు తెలిపారు. గత కాంగ్రెస్ హయాంలో కృష్ణ, గోదావరి జలాలను హైదారాబాద్‌కు తరలించి ప్రజలకు తాగు నీరు ఇచ్చినట్లు గుర్తు చేశారు. హైదారాబాద్‌లోని మూసీని, లేక్ సిటీ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. యావత్ రాష్ట్రంలో హైడ్రాను స్వాగతిస్తున్నారని, రాబోయే కాలంలో అన్ని చెరువులను రక్షిస్తామన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే చర్చల ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు.
"తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దు. మూసీ బాధితుల పట్ల హరీశ్‌రావు లాంటి నాయకులు రాజకీయం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లన్నసాగర్ నిర్వాసితులను లాఠీలతో అణచివేశారు. అధికారం లేదని బీఆర్ఎస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు". - పొన్నం ప్రభాకర్, మంత్రి