Minister Ponnam on Free Bus Videos : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కొందరు ఉద్దేశపూర్వకంగా ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని, రవాణా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణానికి సంబంధించి కొన్ని వీడియాలు ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా ద్వారా వస్తున్నాయని ఆయన ఆరోపించారు. మహిళలు బస్సుల్లో ఊరికనే తిరుగుతున్నారని ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
వెల్లిపాయలు తీస్తున్న వీడియోలు : హుజురాబాద్ నుంచి జమ్మికుంట వెళ్తున్న బస్సులో వెల్లిపాయలు తీసుకుంటూ వెళ్తున్నారని వీడియోలు వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రవాణాశాఖ మంత్రిగా డిసెంబర్ 9 నుంచి మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం పథకం విజయవంతం కావడంతో, విపక్ష పార్టీల కళ్లు మండుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ఉచిత బస్సు సౌకర్యం పథకం ద్వారా 70 కోట్ల మంది ప్రయాణం చేశారని మంత్రి పేర్కొన్నారు.
మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం బీఆర్‌ఎస్‌కు ఇష్టం ఉందా? లేదా? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. ఈ పథకం ఇష్టం లేకనే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆటో కార్మికుల విషయం తీసుకువస్తున్నారని, పొన్నం ధ్వజమెత్తారు. మహిళలను అవమానపరిచే విధంగా ఏ పనిలేకుండా అవహేళనగా వస్తున్న వీడియోలపై చర్యలు తీసుకోవాలని ఆయన సభాపతిని కోరారు. మెట్రో వచ్చిన తర్వాత 5 లక్షల మంది ప్రయాణికులు వెళ్తుంటే అప్పుడు ఆటోల మీద ప్రభావం పడలేదా? అని మంత్రి ప్రశ్నించారు. ఓలా, ఊబర్ వచ్చిన తర్వాత ఆటోల మీద ప్రభావం పడలేదా? అన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కొందరు ఉద్దేశపూర్వకంగా ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణానికి సంబంధించి కొన్ని వీడియాలు ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా ద్వారా వస్తున్నాయి. హుజురాబాద్ నుంచి జమ్మికుంట వెళ్తున్న బస్సులో ఓ మహిళ వెల్లిపాయలు తీసుకుంటూ వెళ్తున్నారని వీడియోలు వచ్చాయి. మహిళలను అవమానపరిచే విధంగా ఏ పనిలేకుండా అవహేళనగా వస్తున్న వీడియోలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. - పొన్నం ప్రభాకర్, రవాణా, బీసీసంక్షేమ శాఖ మంత్రి