Minister Ponnam Prabhakar Fires on Kishan Reddy : కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతింటోదంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. హైదరాబాద్ నగరాన్ని నిర్లక్ష్యం చేసింది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలేనని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు ఏం తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కాగానే తాను హైదరాబాద్ ఇంఛార్జి మంత్రిగా ఆయనను కలిసినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వంలో కేటీఆర్ కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. హైదరాబాద్ నగరం అస్తవ్యస్తం కావడానికి మాజీ మంత్రి కేటీఆర్‌నే కారణమని విమర్శించారు. త్వరలో ఉద్యోగ క్యాలెండర్ తప్పకుండా ఇస్తామని వెల్లడించారు. ఉద్యోగ నియామకాలు జాప్యం అవుతున్నాయని మొన్నటివరకు ప్రశ్నించిన ప్రతిపక్షాలు, ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు రాజకీయ నాయకుల ఉచ్చులో పడొద్దని కోరారు. విద్యార్థుల న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. కేంద్రం హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీ చేయలేదని, అమృత్ పథకం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతోనే రాజకీయ లబ్ధి కోసం హైదరాబాద్‌ను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.
"హైదరాబాద్ చారిత్రక నగరం ఇస్తాంబుల్ వంటిది. చార్మినార్, గోల్కొండ వంటి ఆర్కియాలజీకి సంబంధించి ఎన్నో కట్టడాలు ఉన్నాయి. కేంద్ర పర్యాటక మంత్రిగా గత ఐదేళ్లలో కేంద్రం నుంచి హెరిటేజ్, టూరిజం, ఆర్కియాలజీ విభాగాల నుంచి హైదరాబాద్‌కు కిషన్ రెడ్డి ఏం తెచ్చారు? మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు కావాలని అనేకసార్లు విజ్ఞప్తి చేశాం. హైదరాబాద్‌లో 151 ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు నీటి నిల్వలతో సమస్యలు ఏర్పడుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఇంఛార్జి మంత్రిగా ఇక్కడి సమస్యలు చెప్పడానికి సిద్ధం. వీలైతే హైదరాబాద్ అభివృద్ధికి సహాయం చేయండి." - పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
హైదరాబాద్ ఇలా కావడానికి కారణం కేటీఆర్‌నే : హైదరాబాద్ గురించి ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నారు. అప్పుడు బీజేపీపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక నిధులు తీసుకురాలేకపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఆయన మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని, హైదరాబాద్ ఇలా కావడానికి ప్రధాన కారణం భూకబ్జాలు, అక్రమ కట్టడాలేనని, వీటిని ప్రోత్సహించింది కేటీఆర్ అని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చి కేవలం ఆరు నెలలు మాత్రమే అయిందన్నారు.