Minister Ponnam On Vemulawada Temple : తిరుమలలో వెంగమాంగ అన్నదాన సత్రం మాదిరిగానే వేములవాడలో రాజేరాజేశ్వర స్వామి ఆలయంలో నిత్యాన్నదాన సత్రం నిర్మాణానికి కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాబోవు కార్తీక మాసం నాటికి వేముల వాడ ఆలయంలో నిత్యాన్నదాన సత్రం ప్రారంభిస్తామని ఆయన వివరించారు. శ్రావణమాసం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన మంత్రికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆలయ ఈవోలు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
నిత్యాన్నదాన సత్రానికి కృషి చేస్తాం : అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం రాజరాజేశ్వర స్వామి భక్తుడిగా శ్రావణమాసం సందర్భంగా వేములవాడ రాజన్నను దర్శనం చేసుకున్నట్లు చెప్పారు. ఆలయం మరింత అభివృద్ధి జరగాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యానికి అనుగుణంగా శాస్త్త్రోక్తంగా వేదపండితులు, శృంగేరి పీఠాధిపతి సలహాలుసూచనల మేరకు ఆలయ విస్తరణ చేస్తామని తెలిపారు.
తిరుమలలో ఉన్న నిత్యాన్నదాన కార్యక్రమం మాదిరిగానే వేములవాడలో కూడా నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేసేందుకు శివుని అశీర్వాదం కోరుతున్నామని అన్నారు. నిత్యాన్నదాన సత్రం ఏర్పాటుకు సంబంధించి భక్తులు, దాతల సహకారం కూడా అవసరమని తెలిపారు. తిరుమలలో అన్నదాన సత్రం ప్రారంభించిన దివంగత ఎన్టీఆర్‌ను ప్రజలు ఇప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటున్నట్లు వెల్లడించారు. అన్న దాన సత్రంలో సేవ చేయడానికి స్వచ్ఛంద సంస్థలు, భక్తులు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
నిత్యాన్నదాన సత్రం భవన నిర్మాణాన్ని ప్రభుత్వం తరఫున నిర్మిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో గోశాలలో కోడెలు ఇబ్బందులు కలగడంతో ముఖ్యమంత్రి సూచనలతో అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. భక్తులు ఇచ్చిన కోడె లు పక్కదారి పట్టకూడదని రైతులకు ఉచితంగా ఇప్పటివరకు 1500 కోడెలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో ప్రజలందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని పొరపాట్లు ఉంటే బహిరంగంగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.