Minister Ponnam on Handloom Workers in Sircilla : పదేళ్లు అధికారంలో ఉన్న వారి నిర్లక్ష్యం వల్లే, కార్మికుల జీవితాలు ఇలా ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేనేత రంగాన్ని ఎందుకు ఆదుకోలేదని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్నవారు అనారోగ్య బాధితులకు చికిత్స ఎందుకు చేయించలేదని మండిపడ్డారు. కేటీఆర్, బండి సంజయ్ ఏం చేశారని, చేనేత కార్మికులకు తమ ప్రభుత్వంలో ఇళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
కొందరు కార్మికులకు ఇల్లు లేదని, కొందరు అనారోగ్యంతో బాధపడుతున్నారని మంత్రి పొన్నం తెలిపారు. చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేతన్నల జీవితాలు బాగు చేసేందుకు సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. సిరిసిల్లలో 26 వేల చేనేత మగ్గాలు ఉన్నాయని వాటిని ఆధునీకరించడమే కాకుండా ఎలాంటి పథకాలు అమలు చేయాలో తప్పకుండా ఎన్నికల తర్వాత చర్యలు చేపడతామని చెప్పారు.
Deepa Das Munshi on Handloom Workers : ఇవాళ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీతో కలిసి మంత్రి పొన్నం సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు మల్లేశం కుటుంబాన్ని పరామర్శించారు. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రోహిత్ చౌదరి, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ మాట్లాడారు. కార్మికుల మరణాలను రాజకీయం చేయటం తగదని, ఇది సమయం కాదని దీపాదాస్ మున్షీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లేశం కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
పవర్ లూమ్ క్లస్టర్ మూతపడే పరిస్థితి : కేంద్రంలో పదేళ్లు బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల ఆత్మహత్యలను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేపట్టలేదని, పైగా ఆత్మహత్యలను ఓట్లుగా మల్చుకోవడానికి శవ రాజకీయాలు చేస్తున్నాయని దీపాదాస్ మున్షీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందించకపోవడం వల్ల క్రమంగా సిరిసిల్ల పవర్ లూమ్ క్లస్టర్ మూతపడే పరిస్థితి నెలకొందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. చేనేత కార్మికులకు తప్పకుండా అండగా ఉంటామని, చేనేత రంగాన్ని సాంకేతికంగా, ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
'చనిపోయిన చేనేత కార్మికుడి కుటుంబ సభ్యల దగ్గరకు వెళ్లాం. ఆ కుటుంబానికి ఇల్లు లేదు, మేం వద్దు అన్నామా ? పదేళ్ల పాలనలో ఉన్న వ్యక్తుల బాధ్యులు కాదా ? మా మీద తప్పు నెడుతున్నారు.సిరిసిల్లలో టెక్స్టైల్ పార్క్ నిర్మించాలని కేంద్రాన్ని అడిగాం. కానీ వరంగల్లో ఏర్పాటు చేశారు'- పొన్నం ప్రభాకర్, మంత్రి
కరీంనగర్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ చెప్పాలి : పొన్నం ప్రభాకర్