Minister Ponnam Prabhakar on Household Survey : గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను పబ్లిక్ డొమైన్లో ఉంచలేదని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కార్తిక మాసం రెండో సోమవారం సందర్భంగా ఇవాళ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ బాపిరాజులతో కలిసి కుటుంబ సమేతంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో కోడె మొక్కులు చెల్లించి, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందించగా, ఆలయ ఈవో వినోద్ రెడ్డి తీర్థ ప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి రాజకీయం కోసం, ఇతర అవసరాలకు వాడుకుందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి కుటుంబ సర్వేను పబ్లిక్ డొమైన్లో ఉంచి నిపుణులతో చర్చించి, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అవసరాల ప్రణాళికను రూపొందిస్తామన్నారు. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని కేటీఆర్ మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ అధ్యక్షునిగా తన తండ్రి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్, శాసనసభలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు. ఇందులో రెండు పదవులను ఎస్సీ, బీసీలకు ఇచ్చిన తర్వాతే బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు ఉంటుందని విమర్శించారు.
'సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాధ్యతతో సర్వే చేస్తున్నాం. ప్రభుత్వం బలవంతంగా ఆధార్, పాన్ వివరాలు సేకరించదు. ఇష్టముంటేనే కులం, ఆధార్, పాన్ వివరాలు చెప్పొచ్చు. వివరాలు చెప్పడం ఇష్టం లేకుంటే 999 ఎంపిక ఉంటుంది' - పొన్నం ప్రభాకర్, మంత్రి
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే సర్వే : కాంగ్రెస్లో బీసీలకు అన్యాయం జరిగితే ప్రతి నాయకుడు ప్రశ్నిస్తారని, బీఆర్ఎస్లో మాత్రం ఆ స్వేచ్ఛలేదని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ డైరెక్షన్ ఒకటే అని విమర్శించారు. ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి సర్వేతో బీజేపీ, బీఆర్ఎస్లకు భయం పట్టుకుందని, అందుకే సర్వేను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీ కమిషన్ వేసి లెక్కలు తేల్చిన అనంతరం ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.
అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయని మంత్రి పొన్నం తెలిపారు. ఎన్నికల్లో ఓట్ల కోసం సర్వే చేయడం లేదని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాధ్యతతో సర్వే చేస్తున్నామన్నారు. సర్వేలో ఆధార్ ఇవ్వడం ఆప్షన్ అని, పాన్ కార్డు అడగడం లేదన్నారు. వివరాలు చెప్పాలనుకుంటే చెప్పాలని, లేదంటే అవసరం లేదన్నారు. కులం చెప్పకుంటే 999 ఆప్షన్ ఉందని, సర్వేకు వస్తున్న ఎన్యుమరేటర్ల విధులకు ఆటంకం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.
'మేం రిచ్ పీపుల్ - ఈ సర్వే మాలాంటి వారికి కాదు - మేం ఎలాంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు'
సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించిన గ్రామస్థులు - అధికారులు షాక్! - కారణం ఏంటంటే?
'మా పర్సనల్ డీటెయిల్స్ మీకెందుకు' : ఎన్యూమరేటర్లు ఇళ్లల్లోకి రాకుండా దుర్భాషలు