Minister Ponguleti Fires On BRS : తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో సీతారామ అనుసంధాన కాల్వ పనులను ఆయన పరిశీలించారు. కాల్వ కట్టవద్దకు ట్రాక్టర్‌పై వెళ్లి పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం జల వనరులశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసింది : గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పేరుతో నిధులు దుర్వినియోగం చేసిందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు ప్రణాళిక లేకుండా చేశారని, ఆ విధానాలతో గత పాలకులు ప్రజాధనాన్ని లూటీ చేశారని పొంగులేటి ఆరోపించారు.
ఓ ప్రణాళికతో ప్రాజెక్టులు పూర్తిచేస్తున్నాం : గత సర్కారు నిర్లక్ష్యం చేసిన కాళేశ్వరం, సీతారామ పాలమూరు, ప్రాజెక్టులను చిత్త శుద్ధితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్యాబినెట్ మంత్రులు ఓ ప్రణాళికతో పూర్తి చేస్తున్నారని తెలిపారు. ఖమ్మం జిల్లాలో వైరా, లంకపల్లి ప్రాజెక్టులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మరో 15 మధ్యతరహా తరహా నీటి ప్రాజెక్టులను కూడా ఆధునికీకరిస్తున్నట్లు వెల్లడించారు. గోదావరి జలాలు కృష్ణ ఆయకట్టుకు అనుసంధానం చేసే పనులు ఆగస్టు 15 నాటికి పూర్తయితాయని, ఆ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేపడుతున్నట్లు తెలిపారు.
"సీతారామ ప్రాజెక్టు పేరుతో ఇప్పటికి రూ.18వేల కోట్లతో రెండు లక్షల ఎకరాలు ఆయకట్టు ఎక్కువ చూపించి రూ.2400 కోట్ల బదులు రూ.18000 కోట్లు చేసిన మహానుభావులు బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణను సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ నిర్వాకాలన్నింటిని ఒక్కోదానిని పరిశీలిస్తున్నాం. ప్రాజెక్టులన్నింటినీ రైతులకు ఉపయోగపడే విధంగా సాగులోకి తెచ్చేదాంట్లో కృషి ఫలితమే ఈ లింక్ కెనాల్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ప్రాజెక్టులపై దృష్టిసారించింది."- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి
రైతుభరోసా అమలు చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నాం : భట్టివిక్రమార్క - Rythu Bharosa Workshop In Khammam