Minister Nimmala on Talliki Vandanam Scheme: ఎలాంటి కోతలు లేకుండా తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ విద్యార్థికి 15 వేలు తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకానికి త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామని తెలిపారు. ఓ పండుగ వాతావరణంలోనే తల్లికి వందనం కార్యక్రమం త్వరలో చేపడతామన్నారు.
అబద్ధాలకు, అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైఎస్సార్సీపీ పేటెంట్ పొందిందని ఎద్దేవా చేశారు. 2019లో వచ్చిన మూడంకెల సీట్లు 2024లో డబల్ డిజిట్‌కు పడిపోయునా వైఎస్సార్సీపీకి బుద్ధి రాలేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకుండానే ఫించన్, ఇసుక, తల్లికి వందనం పథకాలపై విషప్రచారం మొదలుపెట్టిన వైఎస్సార్సీపీకి ఈసారి సింగిల్ డిజిటే అని స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు.
అమ్మఒడి ఇద్దరు పిల్లలు ఉన్నా ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పింది జగన్ కాదా అని ప్రశ్నించారు. మేం ఇంకా తల్లికి వందనం విధి విధానాలు రూపొందించక ముందే అసత్యాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. అమ్మఒడిని మోసం దగాతో కేవలం 4 సార్లు మాత్రమే ఇచ్చి ప్రతీ ఏటా ఇస్తానన్న మొత్తం కూడా కుదించేశారని దుయ్యబట్టారు.
'తల్లికి వందనం' పథకానికి ఇంకా మార్గదర్శకాలు ఖరారు కాలేదు: విద్యాశాఖ - Talliki Vandanam Scheme 2024
అమ్మఒడి పథకానికి తూట్లు పొడిచిన వైఎస్సార్సీపీ నేతలకు తల్లికి వందనం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. 2019లో అమ్మఒడిపై ఇద్దరు పిల్లలు ఉన్నా అమ్మఒడి ఇస్తామని భారతీరెడ్డి చెప్పిన వ్యాఖ్యల వీడియోను రామానాయుడు ప్రదర్శించారు. తల్లులను కూడా మోసం చేసిన చరిత్ర వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది అని అన్నారు. అమ్మఒడి కింద రూ.15 వేలు ఇస్తామని తగ్గించి ఇచ్చారని విమర్శించారు.
ప్రభుత్వంపై బ్లూ మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని నిమ్మల మండిపడ్డారు. తల్లికి వందనంపై కూడా బ్లూ మీడియా తప్పుడు వార్తలు రాస్తున్నాయని, ఈ పథకంపై విధివిధాలుపై ఆలోచిస్తున్నామని అన్నారు. తల్లికి వందనం పథకానికి మంగళం పాడినట్లు రాస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని స్పష్టం చేశారు.
మాట ఇస్తే నిలబెట్టికునే ప్రభుత్వం ఎన్డీఏ అని, మాట ఇస్తే మడమతిప్పే ప్రభుత్వం జగన్‌ది అని అన్నారు. రూ.2 వేల పింఛన్‌ను రూ.3 వేలకు పెంచడానికి వైెస్సార్సీపీకి ఐదేళ్లు పట్టిందని, కూటమి ప్రభుత్వంలో ఐదు రోజుల్లోనే పింఛన్‌ను రూ.4 వేలకు పెంచామని తెలిపారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో డీఎస్సీ ఊసేలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఇచ్చామని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న నిమ్మల, మాట ప్రకారం ఉచిత ఇసుక ఇస్తున్నామని పేర్కొన్నారు.