Minister Lokesh Review With Officials on TET and DSC Arrangements: గత ప్రభుత్వ హయాంలో ప్రకటించిన డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్ అధికారులకు సూచించారు. ఎలాంటి విమర్శలకు తావులేకుండా మెగా డీఎస్సీని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం టెట్, డీఎస్సీ నిర్వహణ సహా నైపుణ్య గణన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మెగా డీఎస్సీపై విమర్శలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. టెట్, డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో వారి నుంచి అభిప్రాయాలు సేకరించాలని ఆదేశించారు. పాఠశాలల్లో హేతుబద్ధీకరణకు తీసుకొచ్చిన జీఓ-117 వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పొరుగు సేవల బోధన సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి, వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను లోకేశ్ ఆదేశించారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు.
మెగా డీఎస్సీలో వయోపరిమితి సడలింపుపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేశ్ తెలిపారు. మెగా డీఎస్సీలో కొన్ని జిల్లాలకు ఎస్జీటీ పోస్టులు తక్కువగా ఉన్నాయని పలువురు తన దృష్టికి తెచ్చారని లోకేశ్ ప్రస్తావించారు. ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు మంత్రికి వెల్లడించారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
పాఠశాలలో మధ్యాహ్న భోజన మెనూ ఎలా ఉండాలో తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నారు. ప్రైవేటు పాఠశాల అనుమతుల రెన్యువల్ విషయంలో అనవసర ఆంక్షలు విధించవద్దని లోకేశ్ సూచించారు. టెట్ సిలబస్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎటువంటి మార్పు చేయలేదని, సిలబస్ వివరాలను వెబ్సైట్లో ఉంచినట్లు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.
లోకేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించారు - ఇంకా బాగా పని చేయించుకోండి - చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్రంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర యువతలో నైపుణ్యాలు గుర్తించి శిక్షణ ఇప్పించేందుకు నైపుణ్య గణన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేసి, మెరుగైన విధానాలతో తదుపరి ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని లోకేశ్ అధికారులకు సూచించారు.
హైదరాబాద్‌లో ఏపీ క్యాబ్ డ్రైవర్ల ఇబ్బందులు- మంత్రి లోకేశ్‌కు వినతి - CAB DRIVERS problems