Minister Lokesh Reacts On RTC Driver Dance Video : చిన్న రోడ్డు, ఎదురుగా ట్రాక్టర్. బస్సును ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి. ఏం చేయలేక ఆ ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సును నిలిపేశాడు. ఈలోగా ప్రయాణికులకు వినోదం పంచాలని అనుకున్నాడు. కాసేపు స్టెప్పులు వేసి అందరిని అలరించాడు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారి సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో ఆర్టీసీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు కేటాయించకుండా డ్రైవర్‌ను పక్కన పెట్టారు. ఈలోగా డ్రైవర్ డ్యాన్స్ చేసిన వీడియో ఏపీ మంత్రి లోకేశ్ దృష్టికి వెళ్లింది. ఆయన చోదకుడి సమయస్ఫూర్తిని మెచ్చుకుని, ఎక్స్‌లో ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టారు. దీంతో డ్రైవర్‌కు మంగళవారం నుంచి విధులు కేటాయించారు. ఇది ఏపీలోని కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపో డ్రైవర్ లోవరాజు కథ.
సోషల్ మీడియాలో వీడియో వైరల్ : లోవరాజు తుని ఆర్టీసీ డిపోలో పొరుగు సేవల విధానంలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 24న రౌతులపూడి నుంచి తుని స్టేషన్‌కు బస్సు తీసుకొస్తుండగా మార్గం మధ్యలో కర్రల లోడుతో ఉన్న ట్రాక్టర్ అడ్డుగా నిలిచిపోయింది. బస్సును ముందుకు తీసుకెళ్లే మార్గం లేక నిలిపివేశారు. ఈ సమయంలో అక్కడున్న ఓ యువకుడు వీడియో తీస్తుండగా, లోవరాజు బస్సు ముందు నిల్చొని డ్యాన్స్ చేశారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో లోవరాజుకు అధికారులు తాత్కాలికంగా విధులు కేటాయించలేదు. అయితే తాజాగా ఈ వీడియో మంత్రి లోకేశ్ కంట పడటంతో డ్రైవర్ డ్యాన్స్‌ను మెచ్చుకుంటూ 'సూపర్ బ్రదర్. కీప్ ఇట్ అప్' అంటూ ట్వీట్ చేశారు.
The suspension orders will be revoked, and he will be taken back to work immediately. I will meet him personally when I come back 😊 https://t.co/netfEfeAo3
— Lokesh Nara (@naralokesh) October 28, 2024
లోకేశ్ స్పందన : దీనికి ఓ వ్యక్తి స్పందిస్తూ 'అన్న మీరు ట్వీట్ చేయకముందే ఆ డ్రైవర్‌ను సస్పెండ్ చేశారట. దయచేసి ఆ విషయాన్ని పరిశీలించగలరు. క్రమశిక్షణ, సమయపాలన ముఖ్యం కానీ, దారిలో కొంత హానీ చేయని వినోదం నేరం కాదు కదా' అని లోకేశ్ ట్వీట్‌కు సమాధానం ఇచ్చారు. దీనిపై అమెరికాలో ఉన్న లోకేశ్ వెంటనే స్పందించారు. సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేస్తారని, అతన్ని వెంటనే విధుల్లోకి తీసుకుంటారని స్పష్టం చేశారు. తాను వచ్చిన తర్వాత లోవరాజును వ్యక్తిగతంగా కలుస్తానని పోస్ట్ చేశారు. తన కోసం స్పందించిన మంత్రి తీరుపై డ్రైవర్ లోవరాజు హర్షం వ్యక్తం చేశారు.
ఏపీ మంత్రి లోకేశ్ చొరవ - కువైట్ నుంచి స్వస్థలానికి చేరుకున్న శివ - TELUGU WORKER SHIVA COME TO AP