Minister Konda Surekha Purchase Footwear To a Child in Warangal : రాష్ట్రమంత్రి కొండా సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు. వరంగల్ నుంచి పెద్దపల్లి వెళ్తున్న మంత్రి కొండా సురేఖకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కెట్ కూడలి రోడ్డుపై చెప్పులు లేకుండా తండ్రితో వెళ్తున్న ఒక పాపను చూసి చలించిపోయారు. వెంటనే తన కాన్వాయ్‌ని ఆపి, ఆ తల్లిదండ్రులను అడిగారు. 'తల్లి, తండ్రి ఇద్దరు ఉన్నారు, అయినా చిన్న పాపకి చెప్పులు లేకుండా ఎలా నడిపిస్తున్నారు. ఇంత ఎండగా ఉంది ఎలా తీసుకెళ్తున్నారు' అంటూ వారిని ప్రశ్నించి అక్కడే ఉన్న దుకాణం వద్దకు వారిని తీసుకెళ్లి ప్రత్యేకంగా చెప్పులు కొని అందజేశారు. అంతే కాకుండా ఆ పసి పాపకు బట్టలు కూడా కొనిచ్చి సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు.
మహిళలకు ఉపాధి అవకాశల కోసం చిరు పరిశ్రమలు : రాష్ట్రంలోని అన్యక్రాంతమైన దేవాదాయ శాఖ భూములను వెలికి తీసి అందులో చిరు పరిశ్రమల్లాంటివి ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి, సబితం గ్రామంలోని సీతారామాంజనేయ ఆలయం అభివృద్ధికి రూ.50 లక్షల నిధులు కేటాయించి అందుకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారు.
"రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ లూటీ చేసి - పార్టీ ఫండ్ కింద రూ.1500 కోట్లు దాచుకుంది"
ఈ సందర్భంగా సీతారామచంద్రస్వామి ఆలయంలో మంత్రి సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం దేవాలయాలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. యాదాద్రి, వేములవాడ వంటి మహా పుణ్యక్షేత్రాలను పట్టించుకోకపోగా అక్కడ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోయిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాదాయ భూములపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న దేవుడి మాన్యాన్ని సంరక్షించి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా కృషి చేస్తామన్నారు. అలాగే టీటీడీ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సైతం తెప్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.