Minister komatireddy on NHAI Visit : ఎల్బీనగర్- మల్కాపూర్ జాతీయరహదారి విస్తరణ పనులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. రహదారి విస్తరణ పనులకి అడ్డుగా ఉన్న వాటర్ లేన్, ట్రాన్స్- కో సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడానని ఆయన తెలిపారు. వెంటనే పనులు ప్రారంభించాలని, ఎక్కడ అలసత్వం ఉండొద్దు అని అధికారులకి సూచించారు. న్యాక్‌లో జాతీయ రహదారులపై రోడ్లు, భవనాల శాఖ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
వచ్చే వారంలో జాతీయ రహదారుల హైలెవల్ కమిటీ రాష్ట్రానికి వస్తుందని, అన్ని అంశాలతో అధికార యంత్రంగం సిద్ధంగా ఉండాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ శాఖ అధికారులకి సూచించారు. మన్నెగూడ రహదారికి మార్గం సుగమం చేసేందుకు, ఎన్జీటీ ఆదేశానుసారం 915 చెట్లను రీలొకేట్ చెయ్యాలని ఆయన అధికారులకు సూచించారు.
కాంట్రాక్టు సంస్థ 300 చెట్లను రీలొకేట్ చేసేందుకు సిద్ధంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. మిగతా 615 చెట్లను అటవీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల అధికారులు రీలొకేట్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి రజాక్‌ను ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్, ఎన్‌హెచ్- 65, మన్నెగూడ, ఆర్మూర్-మంచిర్యాల జాతీయ రహదారులపై మంత్రి కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష చేశారు. ప్రజల ప్రాణాలు పోతుంటే నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు స్పష్టం చేశారు. వేగంగా పనులు పూర్తిచేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు.
గడ్కరీతో భేటీ.. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డితో కలిసి కేంద్రమంత్రి గడ్కరీతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, నూతన జాతీయ రహదారుల ప్రకటన, ఇప్పటికే జాతీయ రహదారులుగా ప్రకటించిన మార్గాల పనుల ప్రారంభం తదితర విషయాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రమంత్రితో సమావేశం అనంతరం జాతీయ రహదారుల హైలెవల్ కమిటీ రాష్ట్ర పర్యటన చేస్తోంది.
మరోవైపు రాష్ట్రానికి కీలకం కానున్న రీజనల్ రింగ్ రోడ్డులోని సంగారెడ్డి నుంచి నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-జగదేవ్‌పూర్-భువనగిరి-చౌటుప్పల్(158.645కిమీ) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని సీఎం కోరారు. జాతీయ కమిటీ తన పర్యటన అనంతరం కేంద్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.