Minister Kollu Ravindra on Illegal Mining In YSRCP Government : శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో మోనజైట్, సిలికాన్‌లను ప్రైవేటు ఏజెన్సీలకు అక్రమంగా విక్రయంపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఎమ్మెల్సీల ప్రశ్నలకు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా గార, విశాఖలోని బీమిలీ బీచ్‌లలో అక్రమంగా తవ్వకాలు జరిగిన మాట వాస్తవమేనని మంత్రి తెలిపారు. ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టి అక్రమంగా తవ్వకాలు జరిపి దోచుకున్నారని ఆరోపించారు.
గనుల శాఖలో గతంలో ఉన్న ఉన్నతాధికారులు గోపాలకృష్ణ ద్వివేది, వెంకటరెడ్డి స్వయంగా వెళ్లి ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగానూ చాలా చోట్ల అక్రమంగా గనుల తవ్వకాలు పెద్ద ఎత్తున జరిగాయని మంత్రి పేర్కొన్నారు. గనుల శాఖలో అక్రమ మైనింగ్ ద్వారా 20వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. అప్పటి అధికార పార్టీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తూ దోచుకున్నారని, ప్రస్తుతం అన్ని చోట్లా డిపార్టుమెంటల్ విచారణ జరుగుతోందని తెలిపారు. గనుల శాఖలో జరిగిన దోపిడీ నిగ్గు తేల్చేందుకు సీబీసీఐడీ విచారణ జరపాలని సీఎం చంద్రబాబును కోరామన్నారు. సీఎం ఆదేశిస్తే సీబీసీఐడీ విచారణ జరిపి బాధ్యులందరిపైనా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
Department of Mines Andhra Pradesh : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా గనుల తవ్వకాలు జరిపిన సంగతి తెలిసిందే. జగన్ ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పి విచ్చల విడిగా తవ్వకాలు జరుపుతుంటే చూస్తూ ఊరుకున్నారు. తాను కోట్ల రూపాయల ఆదాయం గడించి ఇసుక రీచ్‌లను అదోగతి పట్టించారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అక్రమ తవ్వకాలు లేవని పలు జిల్లాల కలెక్టర్లు నివేదికలిచ్చి తప్పులు కప్పిపుచ్చే ప్రయత్నం చేయగా, తాజాగా వాస్తవాలతో నివేదికలు ఇస్తామని సుప్రీంకోర్టుకి తెలిపిన ప్రభుత్వం, ఆ దిశగా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ శాఖలో ఐదేళ్లుగా జరిగిన లూటీ లెక్కలు తెల్చి గనుల శాఖను చక్కదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.