Minister Anitha About Cannabis Illegal Transport in YSRCP Regime : గంజాయి నేరస్థులపై కేసులు పెట్టడంతో పాటు వారి ఆస్తులు స్వాధీనం చేసుకునేలా కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత వెల్లడించారు. వారికి ఆస్తులు లేకపోతే ఆధార్, రేషన్ కార్డులను సీజ్ చేస్తామని తెలిపారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిందని, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అడ్డుకునేందుకు నేరస్థుల వివరాలతో ప్రొఫైలింగ్ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, ఆన్‌లైన్ రుణ యాప్‌లపై ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, రెడ్డప్పగారి మాధవీరెడ్డి, సుందరపు విజయ్‌కుమార్, భూమా అఖిల ప్రియ అడిగిన ప్రశ్నలకు శాసనసభలో గురువారం మంత్రి సమాధానమిచ్చారు.
ఏజెన్సీ ప్రాంతాల నుంచి చిన్న పిల్లల పాఠశాల బ్యాగ్‌ల్లో గంజాయి వచ్చి చేరిందని, గంజాయి వల్ల తమ జీవితాలు ఎంత నాశనమయ్యాయో మంత్రి లోకేశ్ పాదయాత్ర సమయంలో ఓ తల్లి ప్రస్తావించిందని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో గంజాయి రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలు సక్రమంగా ఏర్పాటు చేయలేదని ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చర్యల కారణంగా 25వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 916 మందిపై కేసులు నమోదు చేశామని, తాజాగా రాజమహేంద్రవరం జైల్లో ఉన్న నిందితుడికి ఒక ఫార్మసిస్టు గంజాయి అందించిన ఘటనలో నిఘా అధికారులు అతన్ని అరెస్టు చేసి, జైలుకు పంపారని వివరించారు. గంజాయి నిర్మూలనతోపాటు ప్రజల్లో సామాజిక బాధ్యత పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి అనిత తెలిపారు.
ఏకంగా 15 ఎకరాల్లో గంజాయి సాగు - పోలీసులు ఏం చేశారంటే?
దీంతో పాటు మంత్రి రుణయాప్‌ల వల్ల జరిగిన నష్టాలను ప్రస్తావించారు. రుణయాప్‌ల వల్ల రాష్ట్రంలో ఇప్పటి వరకు 212మందిని బాధితులుగా గుర్తించామని, ఈ యాప్‌లకు సంబంధించిన బెదిరింపులకు భయపడి 8మంది ఆత్మహత్య చేసుకున్నారని మంత్రి తెలిపారు. గూగుల్ ప్లేస్టోర్‌లో 456 నకిలీ రుణయాప్‌లు గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వేధింపులకు పాల్పడిన 199మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని వెల్లడించారు. అక్రమ వసూళ్లు, వేధింపులకు పాల్పడే 1,138 మొబైల్ స్పామ్ కాల్స్ నంబర్లు గుర్తించి, టెలికాం డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసి, వాటిని బ్లాక్ చేయించామన్నారు. రుణయాప్‌ల మాయలో చదువుకోని వారితోపాటు చదువుకున్న వారు కూడా బలవుతున్న నేపథ్యంలో విస్తృత చర్చ జరగాలని మంత్రి అనిత పేర్కొన్నారు.
రాష్ట్రానికి పెనుముప్పుగా మారిన డ్రగ్స్ - అమిత్ షాను ట్యాగ్ చేసిన పవన్ కల్యాణ్