YSRCP Leader Quarry Seized in kutagulla : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు బరితెగించారు. కొండలు, గుట్టలను పిండి చేశారు. పరిమితికి మించి ఖనిజాన్ని తరలించారు. అధికారం అండతో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారు. ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ సొమ్మును పక్కదారి పట్టించారు. నిబంధనలకు పాతరేసి ప్రకృతి సంపదను కొల్లగొడుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులు వారికే వంతపాడారు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారి అక్రమాలు ఒక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ నేతకు చెందిన ఓ క్వారీని అధికారులు సీజ్ చేశారు. కదిరి మండలం కుటాగుళ్ల రెవెన్యూ గ్రామంలోని 3.843 హెక్టార్ల భూమిని ఆ పార్టీ నాయకుడు రమేశ్‌రెడ్డి, ఆయన కుమారుడు సాయిప్రణీత్‌రెడ్డి శివసాయి కన్‌స్ట్రక్షన్ పేరిట లీజుకు తీసుకున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ విస్తీర్ణంలో క్వారీ కోసం తవ్వకాలు జరిగాయని అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే ఆది, సోమవారాల్లో మైనింగ్ ఏడీ రామమోహన్‌రావు, సిబ్బంది తనిఖీలు చేశారు. ప్రభుత్వ భూమిలో తవ్వకాలు చేపట్టినట్లు గుర్తించారు. క్వారీతో పాటు క్రషర్‌ను సీజ్ చేశారు. వారికి రూ.12.89 కోట్ల జరిమానా విధించారు.
AP Govt Focus on Illegal Mining : మరోవైపు కూటమి ప్రభుత్వం గత ఐదేళ్లలో జరిగిన అక్రమ మైనింగ్‌పై దృష్టి పెట్టింది. 2014-19 మధ్య మైనింగ్ శాఖ ఆదాయంలో 24 శాతం వృద్ధి సాధిస్తే, 2019-24 మధ్య 7 శాతానికి పడిపోయింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు ఫోకస్ పెట్టారు. లీజులతోపాటు అవి లేనిచోట్ల, ప్రభుత్వ, పట్టా భూముల్లో జరిగిన తవ్వకాలను అధికారులు పరిశీలించి కొలతలు వేశారు. ఆయాచోట్ల వినియోగించిన పర్మిట్లను పరిశీలిస్తున్నారు.
ఎప్పుడో తవ్వకాలు నిలిచిపోయినవి, రెన్యువల్‌కు ఎదురుచూస్తున్న లీజుల్లో కూడా అక్రమ మైనింగ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. వీటితో కలిపి లక్షల టన్నులకుపైనే ఖనిజాన్ని తరలించారని నిర్ధారించారు. ఇలా కోట్లలో వైఎస్సార్సీపీ నేతలు దోచుకున్నట్లు అంచనాకు వచ్చారు. వీటన్నింటిపై అధికారులు నివేదికలను సిద్ధం చేస్తున్నారు. అధికారులు అక్రమ మైనింగ్‌పై దృష్టి పెట్టడంతో వైఎస్సార్సీపీ నేతలు ఎక్కడికక్కడా గప్ చుప్ అయ్యారు. ఎక్కడా తమ బాగోతాలు వెలుగులోకి వస్తాయోనని వారు బిక్కుబిక్కుమంటున్నారు.