Migration Increased In Kurnool Due To Drought: నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు పెద్దలు. బాగా చదువుకున్న విద్యార్థులే బలమైన దేశాన్ని నిర్మించగలరు అనేది నానుడి. కానీ కళ్లముందే విద్యార్థులు చదువుకు దూరం అవుతున్న దుస్థితి కనిపిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. చదువు కోసం కోట్లు ఖర్చుచేస్తున్నామని, నాడు- నేడుతో పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని, ఆంగ్ల బోధనతో విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని, అమ్మఒడి, ట్యాబులు ఇస్తున్నామని, ఆన్లైన్ విద్యతో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు ఏవీ కానరావటం లేదు. విద్యార్థులే లేని పాఠశాలల్లో ఎన్ని వసతులు కల్పిస్తే ఏం ప్రయోజనం మేనమామా అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి కర్నూలును అల్లాడిస్తున్న కరవు - తాగునీటికి ప్రజలు మూగజీవుల అవస్థలు
కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి దశాబ్దాలుగా కరవుతో అనుబంధం ఉంది. ఈసారి ముందుగానే వచ్చిన కరవు పెను భూతంలా గ్రామాలను చుట్టుముట్టింది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్‌లో వేసిన పంటలన్నీ మట్టిలోనే కలిసిపోయాయి. ప్రతి రైతూ లక్షల్లో అప్పులపాలై ఏం చేయాలో దిక్కు తోచని స్థితి నెలకొంది. భూగర్భ జలాలు క్రమంగా అడుగంటిపోయి బోరు బావులు నోళ్లు తెరిచాయి. కనీసం పశువులకు నీరు దొరికే పరిస్థితి సైతం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తి, ఉల్లి, వేరుశెనగ, మిరప, ఆముదం, మొక్కజొన్న, శెనగ, వరి తదితర పంటలు సాగు చేస్తారు. ఖరీఫ్‌లో పంటలేవీ చేతికి అందలేదు. రబీలో కర్నూలు జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1.21 లక్షల హెక్టార్లు కాగా కేవలం 14 వేల హెక్టార్లు మాత్రమే సాగైంది. నంద్యాల జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1.81 లక్షల హెక్టార్లు కాగా కేవలం 27 వేల హెక్టార్లు మాత్రమే సాగైంది. మొత్తంగా రబీలో 15 శాతం మాత్రమే పంటలు సాగయ్యాయి. అవి కూడా నీటి ఆధారంగా వేసిన పంటలే కావటం గమనర్హం. బోరు బావులు సైతం అడుగంటిపోతుండటంతో వేసిన పంటలు చేతికి రాలేదు. దీంతో రైతులు, రైతు కూలీలు కుటుంబాలతో సహా వలసబాట పట్టారు.
ఈ ఏడాది జిల్లాలో రెండు విడతలుగా వలసలు వెళ్లినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. నాలుగు నుంచి ఆరు నెలలపాటు ఇతర ప్రాంతాల్లోనే ఉంటున్నారు. తొలి విడతలో భాగంగా ఆగస్టు నెలలోనే చాలా మంది వెళ్లారు. వీరు జనవరి వరకు పనులు చేసుకుని సంక్రాంతికి ఊళ్లకు వచ్చారు. రెండో విడతలో భాగంగా జనవరి నెలలో సంక్రాంతి తర్వాత భారీగా వలస వెళ్లారు. వీరిలో ఎక్కువ మంది తమతో పాటు తమ పిల్లలను సైతం వలసలకు తీసుకువెళ్లిపోయారు. పని చేయగలిగిన పిల్లలను వెంటబెట్టుకుని వెళ్లారు. దీని ప్రభావం విద్యార్థుల జీవితాలపై అధికంగా పడుతోంది.
కరవు నివారణ చర్యలపై అధికారులకు కేంద్ర బృందం సూచనలు - నేడు నంద్యాల జిల్లాలో పర్యటన
జిల్లాలో పశ్చిమ ప్రాంతంలోని కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల నుంచి వలసల తీవ్రత అధికంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లోని 17 మండలాల్లో 930 పాఠశాలల్లో 2,03,471 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. ప్రస్తుతం వలసల ప్రభావంతో చాలా పాఠశాలల్లో సగానికి పైగా హాజరు శాతం పడిపోయింది. కొన్ని తరగతుల్లో 60 నుంచి 80 శాతం విద్యార్థులు వలస వెళ్లిపోయారు. వీరంతా గుంటూరు, తిరుపతి, రాజంపేట, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వ్యవసాయ పనులు సహా నిర్మాణ రంగంలో పనులు చేసేందుకు వెళ్తున్నారని విద్యార్ధులు తెలిపారు.
పశ్చిమ ప్రాంతంలో ఏటా కరువు, దీనితో పాటే వలసలు సైతం ఉంటాయి. ఈ ఏడాది తీవ్రమైన క్షామం కారణంగా వలస వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. సుమారు 15 వేల నుంచి 20 వేల కుటుంబాల వరకు వలసలు వెళ్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో అక్టోబర్‌లో వలసలు ప్రారంభమయ్యేవి. ఈసారి ఆగస్టులోనే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ముందుగానే మేల్కొని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించి ఉంటే కొంతమేరకు వలసల తీవ్రత తగ్గేది. మరోవైపు వలసలు వెళ్లినా విద్యార్థులకు గ్రామాల్లోనే సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేసి మూడు పూటలా భోజన వసతి కల్పించి ఉంటే పిల్లల చదువులకు కాస్తంత భరోసా దొరికేది. గత ప్రభుత్వ హయాంలో 71 సీజనల్ హాస్టళ్లను నిర్వహించేవారు. దీని వల్ల పిల్లలకు కాస్తంత భరోసా దొరికేది. ఈ ప్రభుత్వం వచ్చాక పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఊళ్లకు ఊళ్లు ఖాళీ - విద్యార్థుల భవిష్యత్తు అంధకారం
గ్రామాల్లో తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఫలితంగా సుమారు మూడు, నాలుగు నెలల పాటు విద్యార్థులు స్కూలుకు దూరం కావటంతో చదువుల్లో బాగా వెనకబడిపోతున్నారు. క్రమం తప్పకుండా బడికి వచ్చే పిల్లలను చదువులో అందుకోలేకపోతున్నారు. ఈ విద్యార్థులకు మళ్లీ మొదటి నుంచి పాఠాలు బోధించాల్సి వస్తోంది. తీరా పరీక్షల సమయానికి స్కూళ్లకు రావటం వల్ల చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. భవిష్యత్తులోనూ దీని ప్రభావం విద్యార్థుల జీవితాలపై పడుతోంది. పోటీ ప్రపంచంలో తోటి విద్యార్థులతో పోటీ పడలేక చతికిలపడిపోతున్నారు. వలసల తీవ్రతను గుర్తించిన ఉపాధ్యాయులు 70 సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయమని అధికారులకు నివేదించారు. ప్రభుత్వం దీనిని పెడచెవిన పెట్టింది. కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని కోరుతున్నాయి.