Hyderabad Metro Disrupted Few Minutes: హైదరాబాద్‌లోని మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఎల్‌బీ నగర్ నుంచి మియాపూర్ వరకు వెళ్లే మెట్రో రైలు మార్గంలో సాంకేతిక సమస్య రావడంతో చైతన్యపురి మెట్రో స్టేషన్‌లో కొన్ని నిమిషాలపాటు మెట్రో రైలు నిలిచిపోయింది. ఈ క్రమంలో మూడు నాలుగు నిమిషాల ఆలస్యం కారణంగా అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రయాణికుల రద్దీతో అమీర్‌పేట జంక్షన్ స్టేషన్‌లో ఫ్లాట్ ఫామ్ కిటకిటలాడింది. రైలు కోసం వేచి చూస్తుండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటూ మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు.
విద్యుత్ ఫీడర్లో సమస్య: విద్యుత్ ఫీడర్ ఛానల్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు మెట్రో సిబ్బంది తెలిపారు. కొద్ది సేపు పాటు తక్కువ వేగంతో రైళ్లను నడిపారు. ఎల్‌బీనగర్ - మియాపూర్ మార్గంలో మెట్రో రైళ్ల ఆలస్యం కారణంగా ప్రతి మెట్రో స్టేషన్ వద్ద కూడా రద్దీ పెరిగి ప్రయాణికులు అసౌర్యానికి గురయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ సాంకేతిక సమస్య ప్రభావం కనిపించింది.
మెట్రో సిబ్బంది అనౌన్స్మెంట్ ఇస్తూ ప్రియమైన ప్రయాణీకులారా సాంకేతిక లోపం కారణంగా బ్లూ లైన్‌లో నడిచే రైళ్లలో స్వల్ప ఆలస్యమైందని త్వరలోనే సర్వీసులు పునరుద్ధరించబడ్డాయని వెల్లడించారు. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం మీ సహకారానికి ధన్యవాదాలు అంటూ తెలిపారు. దాదాపు అరగంట తర్వాత సమస్య పరిష్కరం కావడంతో యథావిధిగా మెట్రో రైళ్లు నడిచాయి.
నగరంలో మెట్రోకు ప్రజల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. రోజు రోజుకు ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఈ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. గతంలో 50 కోట్ల మంది ప్రయాణించి అరుదైన మైలురాయిని మెట్రో చేరుకుందని ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి తెలిపారు. కాగా హైదరాబాద్ మెట్రో రైలు సేవలను ప్రధాని మోదీ 2017 నవంబరు 29న ప్రారంభించారు. మెట్రోను శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడగించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మెట్రోలో ప్రయాణికులకు కాలుష్యం లేకుండా త్వరగా గమ్యస్థానాలు చేరుతుండడంతో మంచి ఆదరణ దక్కుతోంది. నగర వ్యాప్తంగా మెట్రో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.
అఘాయిత్యాలు ఇంకా కొనసాగితే నేనే హోంమంత్రి అవుతా - పోలీసులు ఏం చేస్తున్నారు? : పవన్ కల్యాణ్
పందెం గెలిస్తేనే మనుగడ! - జీవితాలను మలుపుతిప్పే బలుసుతిప్ప పడవల పోటీలు