Metro Rail Officials On Metro Parking Fee : నగరంలో మెట్రో రైలులో ప్రయాణించే వారికి ఎల్అండ్టీ, హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ(హెచ్ఎంఆర్ఎల్) షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై వాహనాలతో వచ్చి మెట్రో స్టేషన్లో పార్కింగ్ చేసి వెళ్లాలంటే కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిందేనని ఎల్అండ్టీ ప్రకటించింది. మొత్తం 3 కారిడార్లలో 50 స్టేషన్లు ఉండగా 40 స్టేషన్ల వద్ద వాహనాల పార్కింగ్ సదుపాయం ఉంది. అందులో చాలా స్టేషన్లలో ఇప్పటికే పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తుండగా నాగోల్ నుంచి మియాపూర్ కారిడార్‌లో చివరి స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు.
అనూహ్యంగా ఆ రెండు చివరి స్టేషన్లలో కూడా ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని ఎత్తివేస్తూ డబ్బులు వసూలు చేయడం పట్ల ప్రయాణికులు ఆందోళనకు దిగారు. టికెట్ ధరలు పెంచడంతో పాటు పార్కింగ్ ఫీజుతో వసూళ్లకు పాల్పడటం అన్యాయమంటూ ఎల్అండ్టీ తీరుపై మండిపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ నాగోల్, మియాపూర్ స్టేషన్లలో కూడా పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తామని స్పష్టం చేసింది.
మెరుగైన సదుపాయాలు అందించేందుకే : ఆగస్టు 25 నుంచి నాగోల్ మెట్రోస్టేషన్, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తామని సంస్థ ప్రకటించింది. పైలట్ రన్‌గా ఇవాళ నాగోల్ మెట్రో స్టేషన్లో పెయిడ్ పార్కింగ్ విధానాన్ని పరిశీలించామని, ప్రయాణికుల ఆందోళనతో తాత్కాలికంగా నిలిపివేసి ఆగస్టు 25 నుంచి అమలు చేస్తామని వెల్లడించింది. నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నట్లు పేర్కొన్న ఎల్అండ్టీ పార్కింగ్ ప్రదేశాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకే పెయిడ్ పార్కింగ్ తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.
ప్రయాణికులు సహకరించాలి : ద్విచక్రవాహనాలు, కార్లు పార్కింగ్ కోసం స్పష్టమైన సూచనలు చేయడంతో పాటు 24 గంటలు సీసీ కెమెరాల నిఘా, సులభమైన పద్ధతిలో చెల్లింపు విధానాలు, బయో టాయిలెట్స్ సౌకర్యం కల్పించేందుకు పార్కింగ్ రుసుము తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం పార్కింగ్ ఫీజులను పర్మినెంట్‌గా డిస్ప్లే చేస్తున్నామని తెలిపింది. ప్రయాణికులు తమ మద్దతు, సహకారాన్ని ఎల్ అండ్ టీ మెట్రో రైలుకు అందించాలని విజ్ఞప్తి చేసింది.
ఉప్పల్ మెట్రో స్టేషన్లో ఫ్రీ పార్కింగ్ వివాదం : హైదరాబాద్ ఉప్పల్ మెట్రోలో ఉచిత పార్కింగ్ ఎత్తివేయడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో కొంత సేపు ప్రయాణికులు, మెట్రో సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమకు ఫ్రీ పార్కింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మెట్రోరైలు టికెట్ల ధరలు పెంచి, ఇప్పుడు పార్కింగ్‌కు కూడా డబ్బులు వసూలు చేయడం అన్యాయమని వాపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది.
మెట్రో విస్తరణకు కసరత్తు - సవాల్‌గా మారబోతున్న రెండోదశ కారిడార్ - HYD Metro Phase 2 Alignment