Thunder Alert by Damini Lightning Alert : రాష్ట్రంలో ఇటీవలే పిడుగుపాటు ఘటనలు వరుసగా చోటుచేసుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే కేవలం రెండ్రోజుల వ్యవధిలో పిడుగుపాటుకు గురై రైతు కుటుంబాలకు చెందిన ముగ్గురు మృతి చెందారు. ఉమ్మడి జిల్లాలో పిడుగుపాటు మరణాలు ఏటా పదుల సంఖ్యలో సంభవిస్తున్నాయి. ఈ ఘటనల్లో మూగజీవాలు సైతం భారీ సంఖ్యలో చనిపోతున్నాయి. మరి రెప్పపాటులో సంభవించే పిడుగుపాటును ముందే పసిగట్టవచ్చు అని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పిడుగుపాటుపై అవగాహన లేకపోవడంతోనే చాలామంది రైతులు, వ్యవసాయ కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారని వారు అంటున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధిక భాగం ఎత్తయిన కొండలు, అటవీ విస్తీర్ణం, గుట్టలను కలిగి ఉంది. ఆయా ప్రాంతాల్లో సాధారణంగానే పిడుగులు పడుతుంటాయి. సముద్ర తీరాని ఉన్న దూర ప్రాంతాల్లో అధిక ఉష్టోగ్రతలు నమోదవుతాయని, గాలిలో విచ్ఛిన్నత అధికమైన వాతావరణంలో పిడుగులు పడే ప్రమాదం ఎక్కువని పరిశోధకులు అంటున్నారు. ఈ కారణాలతోనే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఎక్కువగా పిడుగుపాటు ఘటనలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణంలోని మార్పుల ఆధారంగా జాగ్రత్తపడటంతోపాటు పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టేలా యాప్ సాయంతో ప్రాణాలు కాపాడుకోవచ్చు.
పిడుగుపాటును ముందే గుర్తించొచ్చు : ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు ఎక్కడ ఎక్కడ పడే అవకాశం ఉందో భారత వాతావరణ విభాగం (ఐఎండీ), భూశాస్త్ర మంత్రిత్వ శాఖ (ఎంఓఈఏసీ) ముందే హెచ్చరిస్తోంది. దీని కోసం Damini lighting alert అనే ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను మొబైల్ ఫోన్లోని గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్‌లో కూడా వెళ్లి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాప్‌లో మీ పేరు, ఫోన్ నంబర్, చిరునామా, పిన్‌కోడ్ వంటి వివరాలు రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాత యాప్‌లో మీరు ఉన్న ప్రాంతానికి చుట్టూ 40 కిలో మీటర్ల మేర ఒక సర్కిల్ కనిపిస్తుంది. పిడుగు ఎప్పుడు పడుతుందో అనే హెచ్చరికలను సైతం మూడు రంగుల్లో(ఎరుపు, పసుపు, నీలంరంగు) సూచిస్తుంది.
Lightning is a deadly force in India, causing 2000-2500 deaths annually. DAMINI App, developed by IITM Pune, provides real-time lightning alerts and safety tips to keep you protected.
— IITM Pune (@iitmpune) October 18, 2024
🔸 Get live lightning updates
🔸 Alerts for probable strikes within 40 https://t.co/2k6TrZGpEZ… pic.twitter.com/8Jc6DnaTMj
ఈ జాగ్రత్తలే రక్ష : ఉరుములు, మెరుపులు సంభవించినప్పుడు ఎత్తయిన ప్రదేశాల్లో, భవనాలపై, చెట్ల కింద, వెల్లడిగా ఉండే మైదాన ప్రదేశాల్లో ఉండకూడదని కేవీకే వాతావరణ విభాగం పర్యవేక్షకుడు సుమన్ సూచించారు. విద్యుత్తు నియంత్రికలు, లోహపు పనిముట్లు, కరెంట్ స్తంభాలు, వ్యవసాయ పంపుసెట్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. దగ్గర్లోని లోహపు వస్తువులు ఊగుతున్నా, శరీరం జలదరింపునకు గురవుతున్నా అది పిడుగుపాటు సంకేతంగా భావించాలని సూచించారు. పిడుగుపాటు పడే సమయంలో బహిరంగా ప్రదేశంలో ఉంటే మోకాళ్ల మధ్య తల ఉంచి కూర్చొని, రెండు చేతులతో చెవులు మూసుకోవాలని తెలిపారు.
ఒకవేళ అటవీ ప్రాంతంలో ఉంటే చిన్నగా ఉన్న చెట్ల కింద మాత్రమే కూర్చోవాలని వాతావరణ విభాగం పర్యవేక్షకుడు సుమన్ చెప్పారు. మెరుపులు బాగా వచ్చేటప్పుడు ఇంట్లోని అందరూ ఒకే చోట కాకుండా వివిధ చోట్ల కూర్చోవాలని సూచించారు. ఇంట్లోని ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్‌కు సంబంధించిన ప్లగ్‌లను తీసి ఉంచాలని చెప్పారు. ఉరుముల సమయంలో సెల్‌ఫోన్‌ను ఉపయోగించొద్దని, స్నానాలు చేయొద్దని పేర్కొన్నారు. ప్రయాణంలోనూ కార్లలోంచి కిందకు దిగొద్దని సూచించారు. తడి కన్నా పొడి ప్రదేశాల్లోనే ఉండడం చాలా మంచిదని చెప్పారు. పిడుగుపాటు సమయంలో నీళ్లల్లో ఉంటే త్వరగా బయటకు రావాలని సూచించారు.