Medigadda Barrage Repair Works Update : మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక పునరుద్ధరణ చర్యల్లో భాగంగా రోజుకో సమస్య ఎదురువుతోంది. ఒక సమస్యను పరిశీలించి, ముందడుగు వేసే క్రమంలో మరో సమస్య తలెత్తుతుంది. బ్యారేజీ దెబ్బతిన్న ఏడో బ్లాక్ ప్రాంతం వరద ఉద్ధృతిని తట్టుకునే విధంగా షీట్ పైల్స్ ఏర్పాటు పనులను ఆదివారం ప్రారంభించారు.
మేడిగడ్డ బ్యారేజీ దిగువ ప్లాట్‌ఫాం వద్ద సీసీ బ్లాకుల్లో ఒక వరుస తొలగిస్తున్నారు. తదుపరి షీట్ పైల్స్ ఏర్పాటు పూర్తి చేస్తారు. బ్యారేజీలో గేట్లు తొలగించేందుకు కటింగ్ పనులు సాగుతున్నాయి. దెబ్బతిన్న గేట్లలో 15వ గేటును ఎత్తగా 16వ గేటు ఎత్తే క్రమంలో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి.18, 19, 20, 21 గేట్లను పూర్తిగా కట్‌చేసి తీయాల్సిన పరిస్థితులుండగా ప్రస్తుతం 20వ గేటు కటింగ్ పనులు జరుగుతున్నాయి.
కొనసాగుతున్న గేట్ల కటింగ్ పనులు : 16, 17, 22 గేట్లను సాధారణ స్థితిలో ఎత్తడం వీలు కాకపోతే కటింగ్‌తో తొలగించనున్నారు. మరోవైపు ఏడో బ్లాక్ ప్రాంతంలో బుంగ, నీటి ఊటలు ఏర్పడగా వాటిని నియంత్రించడానికి ఇసుకను నింపుతున్నారు. గ్రౌటింగ్ చేయడానికి యంత్రాలు, సామగ్రిని సమకూర్చుకుంటున్నారు. సోమవారం లేదా మంగళవారం గ్రౌటింగ్ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 85 గేట్లున్నాయి.
వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ గేట్లన్నీ ఎత్తి ఉంచాలని ఎన్‌డీఎస్‌ఏ సూచించింది. ఇందులో భాగంగా ఒకటి నుంచి ఆరో బ్లాక్ వరకు, అలాగే ఎనిమిదో బ్లాక్‌లోను ఉన్న మొత్తం గేట్లు 74 పూర్తి స్థాయి నీటిమట్టం వరకు ఎత్తి ఉంచారు. దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లో మొత్తంగా 11 గేట్లు ఉండగా ఎనిమిది గేట్లపై ప్రభావం ఉండడంతో అవి మూసి ఉన్నాయి. ఇందులో మిగిలిన వాటితో కూడా కలిపి మొత్తం 77 గేట్లు పైకెత్తారు. రెండు గేట్లను పూర్తిగా తొలగించాలి. ఆరు ఎత్తాల్సి ఉంది. ఇందులో ఒక గేటు 90 మీటర్ల వరకు మాత్రమే ఎత్తారు. మిగిలిన గేట్లన్నీ అలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన గేట్లను ఎత్తడం కోసం ఇంజినీర్లు కసరత్తు చేస్తున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ అప్డేట్ - గేట్ల తొలగింపు పనులు షురూ - MEDIGADDA BARRAGE GATES REPAIR
మేడిగడ్డ బ్యారేజీ దిగువన భారీ నీటి ఊటలు - అడుగడుగున సమస్యలే - Medigadda Barrage Repairs