Medigadda Barrage Repair Works Updates : జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా మేడిగడ్డ ఆనకట్టకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని నీటిపారుదలశాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్మాణ సంస్థ ప్రతినిధులు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ అనిల్‌కుమార్, సీడబ్ల్యూసీ ఇంజినీర్ల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
Minister Uttam Kumar Review On Medigadda : మేడిగడ్డ పునరుద్ధరణ పనులపై ఇటీవల జాతీయ ఆనకట్టల భద్రత పర్యవేక్షణ సంస్థ (ఎన్డీఎస్‌ఏ) ప్రభుత్వానికి అందజేసిన మధ్యంతర నివేదిక మేరకు పనులు కొనసాగించాలన్నారు. వర్షాలు త్వరగా వచ్చే అవకాశం ఉన్నందున యుద్ధప్రాతిపదిక రక్షణ చర్యలతో పాటు అవసరమైన మరమ్మతులు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే పనులు ప్రారంభించినట్లు తెలిపిన ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులు మరింత వేగవంతం చేస్తామని చెప్పినట్లు సమాచారం. అవసరమైతే రాత్రి పగలు పనులు చేయాలని మంత్రి వారికి సూచించినట్లు తెలిసింది.
బ్యారేజీ పరిశీలనకు సీఎం రేవంత్‌రెడ్డి : అటు సీజన్లో వీలైనంత నీటిని కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా ఎగువకు ఎత్తిపోసే విషయమై కూడా చర్చించారు. జియో టెక్స్ టైల్స్ లేదా గేబియన్స్ విధానంలో నీటిని మళ్లించి ఎత్తిపోయవచ్చని అధికారులు వివరించారు. ప్రత్యామ్నాయాలపై పూర్తి స్థాయిలో చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఈఎన్సీ జనరల్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. వచ్చేవారం మేడిగడ్డ బ్యారేజీని సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించనున్నారు. పర్యటన తేదీలను నీటిపారుదల శాఖ నాలుగు రోజుల్లో ఖరారు చేయనున్నట్లు తెలిసింది.
జేఎన్‌టీయూ, నిట్ నిపుణులతో కమిటీ : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సూచనలు, సలహాలు అందించేందుకు వివిధ రంగాలకు చెందిన నిపుణులతో కూడిన ఒక కమిటీని నీటిపారుదల శాఖ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ఆదేశాల ప్రకారం ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
నీటిపారుదల శాఖ విశ్రాంత సీఈ కె.శ్రీకాంత్ కన్వీనర్‌గా మరో నలుగురు సభ్యులను కమిటీలో నియమించారు. నిట్ విశ్రాంత ఆచార్యుడు సీబీ కామేశ్వర్‌రావు (సివిల్), విశ్రాంత సీఈ కె.సత్యనారాయణ (మెకానికల్), వరంగల్ నిట్ ఆచార్యుడు రమణమూర్తి (జియో టెక్నికల్), హైదరాబాద్ ఐఐటీ ఆచార్యుడు టి.శశిధర్ (హైడ్రాలజీ- ప్లానింగ్) సభ్యులుగా ఉన్నారు. మూడు బ్యారేజీలను సందర్శించి, సమగ్ర అధ్యయనం చేశాక కమిషన్‌కు ఈ కమిటీ నివేదిక అందిస్తుంది.