Medaram Sammakka Saralamma Jathara 2024: తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం మహాజాతర(Medaram Jatara) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జాతర మొదటి రోజు వనదేవతల ఆగమనం సందడిగా సాగింది. ముందుగా సారలమ్మ గద్దె వద్ద గ్రామస్థులు శుద్ధి చేశారు. ఆ తర్వాత ఆదివాసీ సంప్రదాయాలతో కన్నెపల్లిలో సారలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం అమ్మవారి ప్రతిరూపమైన ముంటెతో పూజారులు బయటకు వెళ్లగానే ఒక్కసారిగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పోటీలు పడ్డారు. సారలమ్మ తల్లికి జేజేలు పలికారు.
డప్పు, డోలు వాద్యాలతో కన్నెపల్లి పరిసరాలు మారుమోగాయి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ, ఎస్పీ శబరీశ్, ఇతర అధికారులు సారలమ్మకు స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు, ఆదివాసీ యువత రక్షణగా మేడారానికి సారలమ్మ(Saralamma) బయల్దేరారు. పాదయాత్రగా జంపన్నవాగును దాటారు. అప్పటికే విచ్చేసిన పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి సారలమ్మ మేడారం గద్దెలపైకి విచ్చేశారు.
Koppavaram Jathara: విచిత్ర వేషధారణలు..పూజారి బడిత పూజ.. కొప్పవరం జాతరలో కోలాహలం
Medaram Jathara 2024 : బుధవారం రాత్రి 12 గంటల తరువాత సారలమ్మ అనంతరం పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి విచ్చేశారు. మంత్రి సీతక్క(Minister Seethakka), జిల్లా కలెక్టర్, ఎస్పీ దేవతలను సాదరంగా గద్దెలపైకి ఆహ్వానించారు. భక్తుల దర్శనాలను, విద్యుత్ దీపాలను నిలిపివేసి గద్దెలపై వన దేవతలను ప్రతిష్ఠించారు. అనంతరం తిరిగి కరెంట్ సరఫరా పునరుద్ధరించి భక్తులకు దర్శనాలు కల్పించారు.
నేడు గద్దెపైకి చేరుకోనున్న సమ్మక్క : మహాజాతర రెండో రోజైన నేడు ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దెలపైకి రానుంది. మేడారం(Medaram) మహా జాతరలో అత్యంత కీలకఘట్టం సమ్మక్క ఆగమనమే. యావత్ భక్తకోటి ఆమె రాక కోసం ఎదురుచూస్తారు. గుట్ట దిగగానే జనం ఆమెకు జేజేలు పలుకుతారు. కాకతీయ సేనలపై అసామాన్య పోరాట పటిమను ప్రదర్శించి అడవి బిడ్డల గుండెల్లో వీరనారీమణిగా నిలిచి దేవతే సమ్మక్క. ఆమె రాక కోసం తనువెల్లా కళ్లు చేసుకుని భక్తులు ఎదురు చూస్తారంటే అతిశయోక్తి కాదు.
కనుల పండువగా.. సత్తెమ్మ తల్లి జాతర
జాతరలో మొదటి రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దె వద్దకు చేరుకుంటే రెండో రోజైన నేడు సాయంత్రానికి సమ్మక్క(Sammakka) గద్దెపైకి విచ్చేస్తుంది. అంతకుముందు చిలకల గుట్టపై కుంకమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కకు పూజారులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తారు. అనంతరం అడవిని వీడి సమ్మక్క జనం మధ్యకు వస్తుంది. డప్పు చప్పుళ్లు, డోలు వాద్యాలు మారుమోగుతుంటే నేరుగా గద్దెలపైకి చేరుతుంది. సమ్మక్క గద్దెలపైకి రాగానే జిల్లా ఎస్పీ గౌరవసూచకంగా గాల్లో కాల్పులు జరపడం ఆనవాయితీగా వస్తోంది. సమ్మక్క రాకతో జాతరలో అసలైన సందడి కనిపిస్తుంది. జాతరలో మూడోరోజు శుక్రవారం గద్దెలపైన తల్లులంతా కనిపించడంతో భక్తులు ఆనందానికి అవధులు ఉండవు. గద్దెలపైన కొలువైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు పోటీపడతారు.