Medaram Jatara Last Day 2024 : గిరిజనుల ఆరాధ్య దైవం, ఆసియాలోనే అతిపెద్ద వేడుక మేడారం మహాజాతర ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. తుది పూజల అనంతరం జనం మధ్య నుంచి వనంలోకి దేవతలు వెళ్లే ప్రక్రియ ముగిసింది. మేడారం గద్దెల నుంచి వనదేవలను ఊరేగింపు చేపట్టారు. అమ్మవార్లు తరలివెళుతున్న క్రమంలో భక్తజనం జయజయధ్వానాలతో వీడ్కోలు పలికారు. తల్లులు మళ్లీ రెండేళ్లకు మళ్లీ తరలిరావాలంటూ వేడుకున్నారు. అమ్మలు వనానికి కదిలే వేళ మేడారంలో చిరుజల్లులు పలకరించాయి.
నాలుగు రోజుల పాటు అట్టహాసంగా జరిగిన గిరిజన జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి దాదాపు కోటిన్నర మంది తరలివచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. అనంతరం ప్రధాన వడ్డెలు ఆయా దేవతలను తీసుకొని వారివారి నిజస్థానాలకు తీసుకెళ్లారు. సారమ్మను కన్నెపల్లి ఆలయానికి, సమ్మక్కను చిలకల గుట్టకు, పగిడిద్దరాజును(Pagiddaraju) పూనుకొండ్లకు, గోవిందరాజులును కొండాయికి తరలించారు.
అశేష జనసందోహంతో అకట్టుకుంటున్న మేడారం డ్రోన్ దృశ్యాలు
దేవతల వనప్రవేశంతో మహాజాతర ముగిసింది. జాతరను ఆద్యంతం నాలుగురోజుల పాటు ఆస్వాదించిన లక్షలాది భక్తజనం మధురస్మృతులను మదినిండా నింపుకుని స్వస్థలాలకు పయనమవుతున్నారు. రెండేళ్లకు మళ్లీ వస్తామంటూ మేడారాన్ని భారంగా వీడుతున్నారు. కోరిన కోరికలను తీర్చే ఇష్టదైవాలను తలుచుకుంటూ ఇంటి బాట పడుతున్నారు.
Minister Seethakka on Medaram Jatara : ఈసారి కోటి 35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని మంత్రి సీతక్క వెల్లడించారు. మేడారం జాతర విజయవంతంగా నిర్వహించామని సీతక్క పేర్కొన్నారు. జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రజలు, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జాతరలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా తమ వంతు కృషి చేశామని పేర్కొన్నారు. 20 శాఖల అధికారులు జాతర పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారని సీతక్క తెలిపారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ వారు నిరంతరం పటిష్ఠ బందోబస్తును(Police Deployment) ఏర్పాటు చేశారన్నారు.
Congress Govt Organized Medaram Jatara : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రేవంత్ ప్రభుత్వం, సమ్మక్క-సారలమ్మ మహాజాతరను ఘనంగా నిర్వహించేందుకు ముందునుంచే కార్యాచరణ అమలు చేసింది. అందులో భాగంగానే తొలుత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. వనదేవతల పండుగ ఆసాంతం భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నాలుగు రోజుల్లో మరింత ఎక్కువమంది అమ్మవార్లను దర్శించుకునే అవకాశం కల్పించేందుకు, అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
మేడారం పరిధిలో ఆ పర్యాటక ప్రాంతాలు మూసివేత - ఏ రోజున తెరుచుకుంటాయంటే?
మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఉపయోగకరంగా ఉండేలా ప్రభుత్వం "మై మేడారం" యాప్‌ను ముందుగా రూపొందించింది. ఇకపోతే జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 6 వేల ప్రత్యేక బస్సులను(Special Buses) ఏర్పాటు చేయటం, అమ్మవార్లను దర్శించుకోవటంలో అశేష భక్తకోటికి ఓ వరంలా మారింది.
ఈక్రమంలోనే మేడారంలో తాత్కాలిక బస్టాండ్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఇక జాతరకు వెళ్లలేని భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ కార్గో సేవల ద్వారా ప్రసాదాన్ని ఇంటికే డెలివరీ చేసేలా సువర్ణవకాశం కల్పించారు. అంతేకాకుండా జాతర ముగిసే వరకు మేడారం వచ్చిన భక్తుల వాహనాలకు ఎటువంటి టోల్‌తో పాటు పర్యావరణ ఛార్జీల వసూలు చేయకూడదని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాలు, పలువురు భక్తులకు ఉపశమనాన్ని కల్పించాయి. మొత్తంగా తెలంగాణ కుంభమేళాను దిగ్విజయంగా జరిగిట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.
మేడారంను 1.35 కోట్ల మంది దర్శించుకున్నారు - మంత్రి సీతక్క
చివరిరోజు తండోపతండాలుగా మేడారం బాటపట్టిన భక్తులు - కిలోమీటర్ల మేర నిలిచిన ఆర్టీసీ బస్సులు