13 People Died Due to Rains in Telangana : రెమాల్ తుపాను ప్రభావం తెలంగాణపైనా పడింది. అకాల వర్షం అన్నదాతలకు నష్టం మిగల్చడమే కాదు, పలుచోట్ల అమాయకుల ప్రాణాలు బలిగొంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా ఈదురుగాలులు, వడగళ్ల వానతో జనజీవనం స్తంభించింది. ఒక్క నాగర్‌కర్నూల్ జిల్లాలోనే వర్షబీభత్సానికి వేర్వేరు చోట్ల ఏడుగురు మృత్యువాత పడ్డారు. తాడూరు శివారు ఇంద్రకల్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్మాణంలో ఉన్న షెడ్డు కూలి నలుగురు మృతి చెందారు. ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు.
Rain Alert in Telangana 2024 : తెలకపల్లి మండల శివారులో పిడుగు పడి లక్ష్మణ్ అనే 13 ఏండ్ల బాలుడు చనిపోయాడు. తిమ్మాజీపేట మండలం మారేపల్లిలో వ్యవసాయ క్షేత్రం వద్ద పొలం పనులు చేస్తున్న కుమ్మరి వెంకటయ్య అనే రైతు మృతి చెందాడు. రేకుల షెడ్డు ఇటుక పడి మరో వ్యక్తి విగతజీవిగా మారాడు. గాయపడ్డవారితో పాటు మృతదేహాలను నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వాసుత్రికి తరలించారు.
సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో వేసవి విడిది కోసం ఇంటికొచ్చిన ఇద్దరి ఉసురు తీసింది గాలివాన. వ్యవసాయ పొలం వద్దకెళ్లి సరదాగా గడుపుతుండగా ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలులకు కోళ్ల ఫామ్ గోడకూలి ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో చెట్టు విరిగి ద్విచక్రవాహనంపై పడటంతో, దానిపై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉంజుపల్లి వద్ద ట్రాక్టర్‌పై చెట్టుపడి 5 మందికి గాయాలు కాగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నల్గొండ జిల్లాలో ఈదురుగాలుల ధాటికి పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. రేకుల ఇళ్లపైన కప్పులు గాలికి కొట్టుకుపోయాయి. పానగల్ రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లి సైదులు అనే యువకుడు గల్లంతయ్యాడు. వికారాబాద్ జిల్లాలో చెట్లు కరెంట్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
అతలాకుతలమైన హైదరాబాద్ : మరోవైపు హైదరాబాద్‌ను సైతం అకాలవర్షం అతలాకుతలం చేసింది. ఎండ తాకిడి నుంచి వాహనదారులకు ఉపశమనం కోసం జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన, గ్రీన్ మ్యాట్ షెడ్ కూలిపోయి ఓ బస్సు, ఇన్నోవాపై పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మల్కాజిగిరి, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్, మన్సూరాబాద్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షాలు నేలకూలాయి.
విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం : వనస్థలిపురంలో ఈదురుగాలలకు, చెట్లు కూలాయి. కారు, ఆటో స్వల్పంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. హఫీజ్‌పేట్ సాయినగర్‌లో ఈదురుగాలులకు ఇంటి గోడ ఇటుకలు, పక్కనే ఉన్న రేకుల ఇంట్లో పడి సమద్ అనే మూడేళ్ల చిన్నారి మృతి చెందాడు. అదే దారిలో నడుచుకుంటూ వెళ్తున్న మరో వ్యక్తిపై ఇటుకలు పడి గాయపడ్డాడు.
Cyclone Remal Effect in Telangana 2024 : టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావంతో డిస్కం పరిధిలో సుమారు 50కి పైగా స్తంభాలు నేలకొరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగి పునరుద్ధరణ చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ఈదురుగాలుల బీభత్సం - వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మృతి - Telangana Rains Today 2024