Heavy Rains Effect in Telangana State : వరుస వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలు వరద నీటిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా ఉంటామని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. రెవెన్యూ, శ్రీచక్ర, రాంరెడ్డి కాలనీలో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పర్యటించిన ఆయన, వర్ష ప్రభావిత ప్రాంతాల బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మోకాలి లోతు నీటిలో పర్యటించిన జగ్గారెడ్డి కాలనీల్లో వరదనీరు పోయేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
కాలనీ వాసులతో మాట్లాడి భవిష్యత్తులో ఇలాంటి ముంపు పరిస్థితులు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి దామోదర రాజనర్సింహా బాధితులకు హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో వర్షం తగ్గినా మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పాకాలవాగు పొంగి ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద 365 జాతీయ రహదారి దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీవర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న రావిరాలలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పర్యటించారు.
Telangana Floods 2024 : ములుగుజిల్లాలోని తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. ఆసిఫాబాద్ మండలంలోని పాతరౌట వద్ద ఉట్ల వాగు ఉద్ధృతితో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి రాకపోకలు నిలిచాయి. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ ఆలయం 9 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. నదీపాయ ఉద్ధృతంగా ప్రవాహించడంతో ప్రధాన ఆలయాన్ని అర్చకులు తాత్కాలికంగా మూసివేశారు. గర్భగుడి వైపు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు మండలాల్లో ఏకధాటి వర్షం కురవడంతో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. తెలంగాణ - ఛత్తీస్‌గడ్ సరిహద్దు ప్రాంతంలో కూంబింగ్‌కు వెళుతున్న సీఆర్పీఎఫ్ జవాన్లు ఇబ్బందిపడ్డారు. నాగారం సమీపంలో భారీ వర్షానికి వాగు ఊరకలెత్తడంతో సుమారు ఆరడుగుల లోతు నీళ్లలో వాగుకు ఇరువైపుల తాడు కట్టిన జవానులు గ్రామస్థులను వాగు దాటించారు ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం మండలంలో ప్రకృతి కర్కశత్వానికి రాకాసి తండా వాసులు బలయ్యారు. ఆ గ్రామ శుభ్రతను తుడిచి పెట్టేసింది.
ఏ ఎదను కదిల్చినా కన్నీటి సమాధానమే : కొన్ని గంటల్లోనే ఆ ఊరు శిథిలావస్థకు చేరుకుంది. ఆకేరు మిగిల్చిన ఆ విషాదం తర్వాత ఏ ఎదను కదిల్చినా కన్నీటి సమాధానమే వినిపిస్తుంది. వాయుగుండం ప్రభావంతో ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లిలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మూడు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, ములుగు, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
"మా రాకాసి తండాలో పిల్లలు చదువుకోడానికి బడి లేదు. వేరేచోటకు వెళ్లి చదువుకుంటున్నారు. అందువల్ల వారు సురక్షితంగా ఈరోజున ఉండగలిగారు. లేకుంటే ఆరోజు రాత్రి వచ్చిన విపత్తుకు ఏమి జరిగి ఉండేదో తలచుకుంటేనే భయమేస్తోంది. ఉన్నపాటుగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డ వరదలకు కట్టుబట్టలతో సమీప గుట్టెక్కి ప్రాణాలను రక్షించుకున్నాం. అందులో మా అందరి ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని, అందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలని వేడుకుంటున్నాం." -వరద బాధితులు
తీరం దాటిన వాయుగుండం - ఈ మూడు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు - Heavy Rains In Telangana