Feline Panleukopenia Virus to Cats : మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పెంపుడు పిల్లుల్లో ‘పానో లుకోపీనియా’ వైరస్ విస్తృతంగా వ్యాపించి, దీని కారణంగా కొద్దిరోజులకే నీరసించి మృతి చెందుతున్నాయి. ఇది సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించుకోవాలని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎం.మోహనరావు తెలిపారు. అద్దంకి పశువుల ఆసుపత్రిలో రెండు పిల్లులు చనిపోయాయి.
ఈ నేపథ్యంలో ఆయన అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పిల్లులు, నక్కలు ‘ఫెలినో’ జాతికి చెందినవిగా పశుసంవర్ధక శాఖలో పిలుస్తారు. పానో లుకోపీనియా రకం వైరస్ పిల్లులు, నక్కలు, క్రూరమృగాల్లోనూ విస్తరించేది గుర్తించారు. ఈ వైరస్ సాంద్రత ఇటీవల కాలంలో పెరగడంతో పెంపుడు పిల్లులు మృత్యువాతకు గురవుతున్నాయి.
వైరస్ లక్షణాలు
- పిల్లికి వైరస్ సోకిన తరువాత రెండు, మూడు రోజులు 102, 103 డిగ్రీల జ్వరం ఉంటుంది.
- ఆ తరువాత పిల్లి ఒంట్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
- ఉష్ణోగ్రతలు తగ్గే కొద్దీ అది ఆహారం తీసుకోవడం మానేస్తుంది.
- ఎప్పుడు ముడుచుకుని ఏదో ఒటికి ఆసరాగా చేసుకుని పడుకుని ఉంటుంది.
- పై లక్షణాలతో పాటు వాంతులు, విరేచనాలు ప్రారంభమవుతాయి.
ఈ విధంగా వైరస్‌తో బాధపడుతున్న పిల్లులు ఆహారం తీసుకోకపోవటం, వాంతులు, విరేచనాలతో శక్తి క్షీణించి చివరకు మృతి చెందుతుంది. వీటిలో ప్రవహించే వైరస్ వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదు. అంతే కాకుండా ఇది జంతువుల నుంచి మనుషులకు సోకదు. ఇది సోకిన 14 రోజుల వరకు వ్యాధి బయటపడే అవకాశం లేదు.
సీ.క్యాట్ టీకా వేయించాలి: పెంపుడు పిల్లులకు ఈ జబ్బు రాకముందే సీ.క్యాట్ టీకా వేయించడం ద్వారా దీన్ని నిలువరించవచ్చు. 45 రోజుల వయసు కలిగిన పెంపుడు పిల్లుల నుంచి ఎంత వయసున్న వాటికైనా టీకా తప్పనిసరి. ‘నోబీ’ కంపెనీది వేయిస్తే కొంతవరకు వైరస్ బారి నుంచి పిల్లులను కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జబ్బు వచ్చిన తరవాత ‘అజిత్రోమైసిన్’, యాంటీ బయాటిక్ ద్రావకం, డాక్సీ సైక్లోన్ ద్రావకాన్ని కిలో బరువున్న పిల్లులకు వేయాలి. అపుడే కొంతవరకు ఉపయోగం ఉండే అవకాశం ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు.
పశువులకూ హాస్టళ్లు - పని మీద ఊరెళ్తున్నారా - మీ పెట్స్‌ని అక్కడ చేర్పించండి!