Manda Krishna Madiga Demanded CM Jagan: విభిన్న ప్రతిభావంతులకు ఇచ్చే పెన్షన్ను 6 వేల రూపాయలకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ 48 గంటలలోపు నిర్ణయం తీసుకోకపోతే వచ్చే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు వ్యతిరేకంగా ఓటేస్తామని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ గౌరవాధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు.
విభిన్న ప్రతిభావంతులకు 6 వేల రూపాయలు పెన్షన్ పెంచాలని, రోస్టర్ పద్ధతి ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి శనివారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు. 26 జిల్లాలలోని విభిన్న ప్రతిభావంతులు సభకు హాజరయ్యారు.
ఎస్సీ వర్గీకరణకు సీఎం జగన్ అడ్డుపడుతున్నారు: మంద కృష్ణ మాదిగ
తెలుగుదేశం పార్టీ నుంచి వర్ల రామయ్య, గోనుగుంట్ల కోటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు సమస్యల పరిష్కారానికి కృషి చేశామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పారు.
విభిన్న ప్రతిభావంతులకు, వృద్ధులకు పెన్షన్ పెంపు, ఆరోగ్యశ్రీ పథకం తమ పోరాటం వల్లే వచ్చిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఆరోగ్యశ్రీ తరహాలో ఆయుష్మాన్ భవ పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ఆరోజు ప్రజల కోసం ఎన్ని పోరాటాలు చేసినా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ తమపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదన్నారు. అలాంటి మనసు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌కు లేదని విమర్శించారు.
ఎస్సీ వర్గీకరణకు సీఎం నిర్లక్ష్యం- మందకృష్ణ కీలక వ్యాఖ్యలు
విభిన్న ప్రతిభావంతుల సమస్యలపై అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు. త్వరలోనే వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలను వ్యక్తిగతంగా కలిసి విభిన్న ప్రతిభావంతులు ఎదుర్కొంటున్న 21 సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ముఖ్యమంత్రి జగన్ తమ సమస్యలపై నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే తాము ఫ్యాన్ గుర్తుకు వ్యతిరేకంగా ఓటేస్తామని హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విభిన్న ప్రతిభావంతులకు ముఖ్యమంత్రి జగన్ రద్దు చేసిన పథకాలన్నీ పునరుద్ధరిస్తామని గోనుగుంట్ల కోటేశ్వరరావు చెప్పారు.
"అధికారం మీ చేతిలో ఉంది. కాబట్టి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇవ్వొచ్చు. వికలాంగుల పోరాట సమితి 21 డిమాండ్లు ఉన్నాయి. మొత్తం పరిష్కరిస్తామన్న అంశం మరో 48 గంటల్లో వెంటనే తేల్చాలి. మీరు పెన్షన్ పెంచకపోతే మీకు వ్యతిరేకంగా రాజకీయంగా బుద్ధి చెప్పే పరిస్థితులు వస్తాయని తెలియజేస్తున్నాము. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు సైతం విజ్ఞప్తి చేస్తున్నాము. టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో 6 వేల పెన్షన్ పెంపు సహా డిమాండ్లు అన్నీ ఉండాలని కోరుతున్నా". -మందకృష్ణ మాదిగ, వీ.హెచ్.పీ.ఎస్ అధ్యక్షుడు
న్యాయబద్దమైన డిమాండ్‌తో నిరసనలు చేస్తే.. కేసులా! సీఎం బుద్ధి చెబుతాం: మందకృష్ణ