Manchu Vishnu Press Meet in Hospital : నిన్న జల్పల్లిలోని తమ నివాసంలో జరిగిన ఘర్షణలో రిపోర్టర్‌పై దాడి జరగడం దురదృష్టకరమని మంచు విష్ణు తెలిపారు. గత రెండు రోజులుగా తమ కుటుంబంలో తారాస్థాయికి చేరిన వివాదంపై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రతి కుటుంబంలో గొడవలు సహజమని, తమ ఇంట్లో గొడవను పెద్దదిగా చేసి చూపించవద్దని ఆయన ఈ సందర్భంగా మీడియాకు విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రి ప్రాంగణంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా ప్రేమతో గెలవాలని, రచ్చతో కాదని తన తమ్ముడిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
జర్నలిస్ట్‌పై దాడి దురదృష్టకరం : ఈ ఘర్షణలో ఓ జర్నలిస్టుకు గాయాలు కావడం దురదృష్టకరమని మంచు విష్ణు తెలిపారు. మంగళవారం(డిసెంబరు 11)న జరిగిన ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, తన తండ్రి మోహన్‌బాబు నమస్కరిస్తూనే మీడియా ముందుకు వచ్చారని, ఓ మీడియా ఛానల్ రిపోర్టర్ మైకును మొహం మీద పెట్టడంతో ఆవేశంలో కొట్టారని అన్నారు. వాస్తవానికి అలా జరిగి ఉండకూడదని పేర్కొన్నారు. ఆ ఘర్షణలో మోహన్ బాబుకు కూడా కొన్ని గాయాలయినట్లు తెలిపారు. గాయపడిన జర్నలిస్టు కుటుంబ సభ్యులతో మంచు విష్ణు స్వయంగా మాట్లాడినట్లు చెప్పారు.
మీడియాకు ముందే లీకులు : భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న కన్నప్ప సినిమా పోస్టు ప్రొడక్షన్ వర్క్ మీద లాస్‌ఏంజెల్స్‌లో ఉండగా ఫోన్ వచ్చినట్లు విష్ణు మీడియాకు తెలిపారు. దీంతో వెంటనే అమెరికా నుంచి హుటాహుటిన బయలుదేరి వచ్చినట్లు చెప్పారు. తమకు పోలీసుల నోటీసులు రాకముందే మీడియాకు లీక్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తుపాకిని సరెండర్ చేయాలని ఆదేశించినట్లు మీడియాలోనే వచ్చిందని అన్నారు. ఈ అంశంపై ఇవాళ ఉదయం 10.30 గంటలకు తనకు నోటీసులు అందినట్లు వెల్లడించారు.
ఉదయం ఒక గంట ముందు నోటీసులు ఇచ్చి 10.30కు విచారణకు రమ్మంటే ఎలా? కుదురుతుందని ప్రశ్నించారు. అయినా రాచకొండ కమిషనర్‌పై ఉన్న గౌరవంతో విచారణకు వెళ్తానని తెలిపారు. ఏ ప్రాతిపదికన తనకు నోటీసులు ఇచ్చారోనని వాపోయారు. గొడవ జరిగినప్పుడు తాను ఈ దేశంలోనే లేనప్పుడు నోటీసు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సీపీని కలవాల్సిన అవసరం తనకు లేకున్నా కుడా గౌరవంతో కలుస్తానని అన్నారు. కడుపును చించుకుంటే తమ కాళ్లపై పడుతుందని, కుటుంబ వివాదం గురించి ఇంకా ఏమీ మాట్లాడదలుచుకోలేదని చెప్పారు. తన తమ్ముడు మనోజ్ చిన్నవాడు కాబట్టి అవగాహన లేకుండా మాట్లాడి ఉండొచ్చునని పేర్కొన్నారు. తాను మాత్రం ఇష్టానికి వచ్చినట్లు మాట్లాడలేనని స్పష్టం చేశారు.
"ప్రతి కుటుంబంలో గొడవలు సహజంగా ఉంటాయి. సమస్య పరిష్కారం కోసం మా కుటుంబ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. దయచేసి మా ఇంట్లో గొడవను పెద్దదిగా చేసి చూపించవద్దని నా మనవి. వివాదం సామరస్యంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నా. ఏదైనా ప్రేమతోనే గెలవాలి కానీ రచ్చ చేసి కాదు."- మంచు విష్ణు, మోహన్ బాబు కుమారుడు
హైకోర్టులో మోహన్‌బాబుకు ఊరట - అప్పటివరకు పోలీసుల ముందు హాజరుకు మినహాయింపు
హీరో మంచు మనోజ్‌పై దాడి కేసు - మంచు విష్ణు ప్రధాన అనుచరుడు అరెస్ట్