మహాత్ముడికి మందిరం- ఈ గాంధీ ఆలయ విశేషాలేమిటంటే? - Mahatma Gandhi Temple - MAHATMA GANDHI TEMPLE
Mahatma Gandhi Temple : ఆంగ్లపాలకుల నుంచి భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రసాదించిన మహనీయుడు మహాత్మాగాంధీ. భారతీయులందరినీ ఏకతాటి పైకి తీసుకొచ్చి, అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ మహాత్ముడి జీవితం గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఆయనకి ఓ గుడి కట్టారు. నిత్యం అక్కడ ప్రత్యేక పూజలు సైతం నిర్వహిస్తున్నారు. ఈ గుడి విశేషాలు తెలుసుకుందాం.
Published : Oct 2, 2024, 8:57 AM IST
Special Story on Gandhi Temple : నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన 4 ఎకరాల విస్తీర్ణంలో మహాత్మాగాంధీ ఆలయం నిర్మించారు. గుంటూరుకు చెందిన మోర శ్రీపాల్ రెడ్డి, భూపాల్‌రెడ్డి మహాత్మా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విరాళాలు సేకరించి 2014 సెప్టెంబర్ 15న గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
సబర్మతీ ఆశ్రమం మట్టి సేకరణ : దేశంలోని 30 ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి మట్టి సేకరించి గర్భగుడి చుట్టూ గాజు పెట్టెలో అమర్చారు. గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి తెచ్చిన మట్టిని భక్తుల దర్శనార్థం ఆలయ వెలుపల గుట్టగా అమర్చారు. ఆలయం ముందు భాగాన 32 అడుగుల ధ్వజ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ ఆలయాల్లో నంది విగ్రహం ఉండే చోట అశోక ధర్మచక్రం ఏర్పాటు చేశారు.
ఈ ఆలయంలో హిందూ దేవాలయాల మాదిరే నిత్యం పూజలు జరుగుతాయి. ఆలయాన్ని రోజూ ఉదయం 6 గంటలకు సుప్రభాత కీర్తనలతో తెరుస్తారు. అన్ని దేవాలయాల్లో మాదిరిగా ఇక్కడ అష్టోత్తరం, శతనామకరణం వంటి అనేక పూజలు, ధూప, దీప, నైవేద్యాలు ఉంటాయని అర్చకులు చెబుతున్నారు.
"మనం మహాత్మా గాంధీజీని పరమాత్మగా భావిస్తాం.ఇక్కడ హిందూ దేవాలయాల మాదిరే గాంధీజీకి నిత్యం పూజలు నిర్వహిస్తాము. ఆలయాన్ని రోజూ ఉదయం 6 గంటలకు సుప్రభాత కీర్తనలతో తెరుస్తాము. ఇక్కడ అష్టోత్తరం, శతనామకరణం వంటి అనేక పూజలు, ధూప, దీప, నైవేద్యాలు ఉంటాయి". - నారాయణ చారి, మహాత్మాగాంధీ ఆలయ అర్చకులు
దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుని స్మృతులను భావితరాలకు అందించే ఉద్దేశంతో ఆలయం నిర్మించినట్లు మహాత్మా ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. గాంధీకి చెందిన పుస్తకాలు, స్వాతంత్య్ర ఉద్యమ జ్ఞాపకాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆలయం బయట ఉన్న మర్రిచెట్టుకు ముడుపులు కడితే కోరికలు నెరవేరుతాయని పలువురు చెబుతున్నారు.
"దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుని స్మృతులను భావితరాలకు అందించే ఉద్దేశంతో ఆలయం నిర్మించాము. గాంధీకి చెందిన పుస్తకాలు, స్వాతంత్య్ర ఉద్యమ జ్ఞాపకాలకు సంబంధించిన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంచాము". - మహాత్మా ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు
మహాత్మునికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ ఘన నివాళులు - PM Modi Pays Tribute To Gandhi