Mahabubnagar MLC Vote Counting Postponed : రేపు జరగాల్సిన మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఆదేశాలు జారీ చేసింది. జూన్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి, జూన్ 5వ తేది నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అందులో పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. అదే రోజు నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి సైతం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తే, అది పార్లమెంట్ ఎన్నికలపైనా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున లెక్కింపును జూన్ 2వ తేదికి వాయిదా వేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవినాయక్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
Mahabubnagar MLC Results Postponed : మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ మార్చి 28న జరగ్గా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1437 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 99.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో, మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబ్‌నగర్ బాలుర జూనియర్ కళాశాల స్ట్రాంగ్ రూంలో ప్రస్తుతం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. రేపు ఓట్ల లెక్కింపు అక్కడే జరగాల్సి ఉండగా వాయిదా పడింది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేయడం వల్ల మార్చి 28న ఉప ఎన్నిక నిర్వహించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్(BRS) నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు.