Madanapalle Sub Collectorate Fire Accident Case: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం వెనుక కుట్రకోణంపై ఐదోరోజు విచారణ కొనసాగింది. దస్త్రాల దహనం కేసులో రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పాత్రపై అనుమానాలు ఉన్నాయని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోదియా తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక రాగానే బాధ్యులపై సస్పెన్షన్ వేటు వేయడంతో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మూడు రోజులపాటు మదనపల్లెలో మకాం వేసిన సిసోదియా పెద్దిరెడ్డి భూ బాధితుల నుంచి రెండోరోజు అర్జీలు స్వీకరించారు. మదనపల్లె నుంచి రాయచోటిలోని కలెక్టరేట్‌కు వెళ్లి అధికారులతో మాట్లాడారు.
చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో దాదాపు 2 లక్షల 16 వేల ఎకరాల భూమి ఫ్రీ హోల్డ్‌లో పెట్టారని 4వేల 400ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగినట్లు సిసోదియా వెల్లడించారు. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. దస్త్రాల దహనం ఘటనలో మరికొందరు అనుమానితులను మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో పోలీసులు విచారించారు. కేసు పురోగతిపై సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్, వీఆర్ఏ రమణయ్య ఐదురోజులుగా పోలీసులు అదుపులోనే ఉన్నారు. ట్రాన్స్‌కో, అగ్నిమాపక సిబ్బందిని డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు.
అకస్మిక తనిఖీలు: కడప జిల్లా స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సిసోదియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం అన్నమయ్య జిల్లాలో పర్యటన ముగించుకుని విజయవాడ వెళ్తూ కడపలోని రిజిస్ట్రేషన్ జిల్లా కార్యాలయంలో పలు రకాల రిజిస్టర్ ఫైళ్లను కలెక్టర్, జేసీలతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా సమస్యలు రాకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వర్తించాలాని జిల్లా రిజిస్ట్రార్‌కు సూచించారు.
ఫిర్యాదులు స్వీకరణ: సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, సిసోదియా విచారణ జరిపి మదనపల్లి నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. నేడు కూడా చాలామంది భూ బాధితులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి అర్జీలు ఇవ్వడానికి వచ్చారు. సిసోదియా విజయవాడకు వెళ్తున్న సమయంలోనే గేటు బయట ఉన్న ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వీటన్నిటిపై సమగ్ర విచారణ చేస్తామని మీడియాకు వెల్లడించారు. దీంతోపాటు అనుమానితులను కూడా పోలీస్ శాఖ సీఐడీ అధికారులు డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నిస్తున్నారు.