Madanapalle Fire Accident Case Investigation Reached Final Stage : మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు అధికారుల దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. 22-Aతో పాటు 25 రకాల దస్త్రాలు తగలబడిన ఘటనలో వైఎస్సార్సీపీ నేతలు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చినట్లు సమాచారం. విచారణలో పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు నమోదు చేయడంతో ఐదేళ్లలో రెవెన్యూ అధికారుల అండతో భూ ఆక్రమణలకు పాల్పడిన నేతల్లో భయం మొదలైంది.
వైఎస్సార్సీపీ నేతల కుట్ర : మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు వైఎస్సార్సీపీ నేతల చుట్టూ తిరుగుతోంది. ఘటన వెనుక కుట్రకోణాన్ని వెలుగులోకి తెచ్చేందుకు పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. దస్త్రాల దహనం ఘటనలో 53 మంది అనుమానితులుగా గుర్తించి విచారణ చేపట్టారు. సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సిబ్బందితో పాటు బయటి వ్యక్తులు పదిహేను మందిని ఇప్పటి వరకు పోలీసులు విచారించారు.
పోలీసులు విచారించిన వారిలో రెవెన్యూ సిబ్బందేతర వ్యక్తుల అందరూ మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కావడం కీలకంగా మారింది. ఐదేళ్ల పాటు సాగిన భూ భాగోతాలపై వినతి పత్రాలు స్వీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల అక్రమాలపై బాధితులు ఏకరవు పెట్టారు.
మదనపల్లె అగ్ని ప్రమాదం నిగ్గుతేల్చిన సిసోదియా!- ప్రభుత్వానికి కీలక నివేదిక - SISODIA REPORT
విచారణ వేగవంతం : దస్త్రాల దహనం కేసు దర్యాప్తుపై ఏర్పాటు చేసిన రెవెన్యూ, పోలీసుల ప్రత్యేక బృందాలు సబ్ కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులతో పాటు పలువురు అనుమానితులను విచారించారు. ప్రధానంగా వైఎస్సార్సీపీ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించడం డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారించడం ద్వారా కీలక సమాచారాన్ని రాబట్టారు. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు జింకా చలపతి, బాబ్‌జాన్‌తో పాటు పలువురిని విచారించారు. పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశిధర్, తుకారాం పరారీలో ఉండగా వారి ఇళ్లలో సోదాలు చేశారు. పలు కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.
ప్రత్యేక బృందాలతో గాలింపు : కేసులో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి అలియాస్ రైస్‌మిల్ మాధవరెడ్డి పరారీలో ఉండటంతో అతని కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఇప్పటి వరకు వైఎస్సార్సీపీ నేతలు, రెవెన్యూ ఉద్యోగులను విచారించిన పోలీసులు భూముల క్రయ విక్రయాల్లో కీలకంగా వ్యవహరించే డాక్యుమెంట్ రైటర్లను కొంత మందిని విచారించనున్నట్లు తెలిసింది.