Macherla Pinnelli Ramakrishna Reddy EVM Destroy Video: ఈ నెల 13న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాచర్లలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన దౌర్జన్యాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202)లోకి వెళ్లిన పిన్నెల్లి, అక్కడ ఈవీఎం ఎత్తి నేలకేసి కొట్టడంతోపాటు వీవీ ప్యాట్ మిషన్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఒక్కసారి పోలింగ్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అయితే అక్కడే ఉన్న విపక్షపార్టీ పోలింగ్ ఏజెంట్ ఒక్క ఉదుటున దూసుకెళ్లి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడిపై దాడి చేశాడు. ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ దృశ్యాలన్నీ పోలీంగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎన్నికల ముందు నుంచీ మాచర్లలో పిన్నెల్లి సోదరుల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయంటూ తెలుగుదేశం చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేట్లు, ఏకంగా ఎమ్మెల్యేనే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి దౌర్జన్యం చేయడం చూస్తే అక్కడ పోలింగ్ ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
పల్నాడులో వైఎస్సార్సీపీ దాష్టీకం - టీడీపీ నాయకులపై కర్రలతో దాడి - YSRCP Attack
పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణుల వల్లే విధ్వంసం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇదిలావుంటే ఇప్పటికే ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన సోదరుడు పల్నాడు జిల్లా వదిలి హైదరాబాద్ వెళ్లిపోయారు. దాడులకు పాల్పడిన పిన్నెల్లి, పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతోనే హైదరాబాద్ వెళ్లారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మాచర్ల ప్రాంతంలో జరిగిన ఘటనలు, అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని మాచర్ల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. దీనికి పిన్నెల్లి సోదరులు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
Violence in Palnadu AP Elections: ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ శ్రేణులపై దాడులు చేస్తూ బీభత్సం సృష్టించారు. నాటు బాంబులు, పెట్రోల్ సీసాలతో దాడులు చేశారు. రెంటచింతల మండలం తుమృకోటలో పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. అదే విధంగా కంభంపాడులో గొడ్డళ్లు, వేటకొడవళ్లు, రాడ్లతో వైఎస్సార్సీపీ నేతలు రహదారి పైకి వచ్చి గందరగోళం సృష్టించారు.
రెంటాలలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై వైఎస్సార్సీపీ వర్గీయులు దాడి చేశారు. అదే విధంగా రెంటాలలో వైఎస్సార్సీపీ మూకలు విధ్వంసం సృష్టించాయి. తెలుగుదేశం అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి వాహనానికి నిప్పుపెట్టాయి. రెంటాల పోలింగ్ సరళిని చూసేందుకు బ్రహ్మానందరెడ్డి వెళ్లగా ఆయన కారుపై రాళ్లు విసిరి అద్దాలు ధ్వంసం చేశాయి. అదే విధంగా నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద బాబు కారుపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. పోలింగ్ సమయంలో వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు చేసిన దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ - 'ఆ ఎమ్మెల్యే'ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశం - MLA house arrest
ఈసీ సీరియస్: ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. కఠినంగా వ్యవహరించాలని డీజీపీని ఆదేశించింది. అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈవీఏంల ధ్వంసం ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అటువంటి అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజీని పోలీసులకు అందజేశారు. విచారణలో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఈసీ చాలా తీవ్రంగా పరిగణిస్తూ, ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో రాజీ పడేది లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.