Lucky Mirani Yuva story : కంటిచూపు లేకపోవడమనేది లోపమని ఎప్పుడూ భావించలేదంటున్నాడు ఈయువకుడు. దురదృష్టవశాత్తూ చిన్నప్పుడే రెటినాల్ డిస్ట్రోఫీ బారిన పడినా, బ్రెయిలీ లిపిపై ఆధారపడకుండా సాధారణ విద్యార్థులతో కలిసే చదువు కొనసాగిస్తున్నాడు. అద్భుత జ్ఞాపకశక్తితో చదువుల్లో మొదటి ర్యాంకులు సాధిస్తూ, జాతీయస్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కరీంనగర్‌కు చెందిన లక్కీ మిరానీ, పుట్టుకతోనే అంధుడు కాదు. దురదృష్టవశాత్తూ 3వ తరగతిలో ఉన్నప్పుడు, కోట్లలో ఒకరికే వచ్చే రెటినాల్ డిస్ట్రోఫీ బారిన పడ్డాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో తల్లిదండ్రులు దీపక్ మిరానీ, ముస్కాన్ మిరానీలు దిగాలు పడ్డారు.
పేదింటి పెన్సిల్ ఆర్టిస్టు - డ్రాయింగ్‌తో చిత్రాలకు ప్రాణం పోస్తున్న యువకుడు - pencil artist ganesh
లక్కీ ఐదవ తరగతిలోకి వచ్చేసరికి పూర్తిగా చూపు కోల్పోయాడు. చూపు పోయిన తర్వాతా బ్రెయిలీ లిపిపై ఆధారపడకుండా సాధారణ పద్ధతిలోనే చదువు కొనసాగించాడు లక్కీ మిరానీ. వృత్తిరీత్యా తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో, ఇంటివద్దే ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. తల్లి ముస్కాన్ కూడా ఓపికతో ప్రతిపాఠం చదివి వినిపించేది. అలా 10వ తరగతిలో ఏకంగా పదికి పది జీపీఏ సాధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డును అందుకున్నాడు.
ఇంటర్‌లోనూ 96% మార్కులతో ఆశ్చర్యపరిచాడు లక్కీ మిరానీ. హెచ్‌సీయు ఇంటిగ్రేటెడ్ ఎంఏ, సోషల్ సైన్స్ ఎంట్రన్స్ పరీక్షలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడంతో లక్కీ పేరు మార్మోగింది. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఐఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు లక్కీ మిరానీ. బీ మై ఐస్ యాప్ ద్వారా పనిచేసే ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సహాయంతో మొబైల్, ల్యాప్‌టాప్‌లో కంప్యూటర్ కోడింగ్ శిక్షణ కూడా పొందాడు.
ఈ నేపథ్యంలోనే సంగీతంలోనూ ప్రవేశమున్న లక్కీ మిరానీ, లైట్ అండ్ డార్క్ అనే ఒక డాక్యుమెంటరీ నిర్మించాడు. సొంతంగా స్క్రిప్ట్ సమకూర్చి స్నేహితుల సాయంతో దర్శకత్వం వహించాడు. దానిని దేశవ్యాప్తంగా పలుచోట్ల ప్రదర్శించి ప్రముఖుల మన్ననలు అందుకున్నాడు. బెంగళూరులోని సింధీ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా నుంచి అఛీవర్స్ అవార్డు పొందాడు. రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం సహా ఇప్పటిదాకా 38 అవార్డులు అందుకున్నాడు లక్కీ మిరానీ. ఏఐ సాయంతో దివ్యాంగులకూ సాధారణ విద్యార్థులతో చదివే అవకాశం దక్కాలని ఆకాంక్షిస్తున్నాడు.
ఆత్మవిశ్వాసంతో కచ్చితమైన ప్రణాళికలు పాటిస్తూ అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్న లక్కీ మిరానీని చూస్తే గర్వంగా ఉందంటున్నారు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. తల్లిదండ్రులే కంటిచూపులా మారి తనని గెలుపుబాటలో నడిపిస్తున్నారని అంటున్నాడు లక్కీమిరానీ. వారి సహకారంతో తన చిరకాల స్వప్నమైన సివిల్స్ సాధించి తీరతానని ధీమాగా చెబుతున్నాడు.
"ఐదవ తరగతిలోకి వచ్చేసరికి పూర్తిగా చూపు కోల్పోయాను. చూపు పోయిన తర్వాతా బ్రెయిలీ లిపిపై ఆధారపడకుండా సాధారణ పద్ధతిలోనే చదువు కొనసాగించాను. ప్రస్తుతం హెచ్‌సీయు ఇంటిగ్రేటెడ్ ఎంఏ, సోషల్ సైన్స్ చదువుతున్నాను. నా చిరకాల స్వప్నమైన సివిల్స్ సాధించి తీరుతాను". - లక్కీ మిరానీ, విద్యార్థి
టెబుల్ టెన్నిస్‌లో మనిక బాత్రా సంచలనం- తొలి మహిళా ప్లేయర్‌గా రికార్డ్ - Table Tennis Rankings
తెలంగాణ యువ కెరటం- సాఫ్ట్‌బాల్ క్రీడలో అదరగొడుతున్న రాణి - Lakawat Rani softball player