Lok Sabha Elections 2024 : సార్వత్రిక ఎన్నికలకు ప్రచార గడువు సమయం సమీపిస్తున్నకొద్దీ, అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో పార్టీ బూత్ స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొన్న చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి రాష్ట్రప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ గెలుపునకు కృషి చేయాలని చెప్పారు.
రిజర్వేషన్ల రద్దు కోసమే జనగణనలో జాప్యం : సీఎం రేవంత్ - CM Revanth Jana Jatara Sabha
వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్‌కు మద్దతుగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రచారం నిర్వహించారు. నాగార్జున సాగర్ నియోజక వర్గం త్రిపురారంలో ఎమ్మెల్యే జైవీర్, రఘువీర్‌రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారు. చింతలపాలెం దొండపాడులో జరిగిన ప్రచారసభలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఆయన బంధువులు మిరుదొడ్డిలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. బీఆర్ఎస్‌కు మద్దతుగా భద్రాచలంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఓట్లు అభ్యర్థించారు. వరంగల్‌లోని పలు డివిజన్లలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌తో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్‌కుమార్ ప్రచారం నిర్వహించారు. భూపాలపల్లి సుభాష్ కాలనీలోని సంతలో బజ్జీలు వేస్తూ ఓట్లు అభ్యర్థించారు.
హామీలు అమలుచేయకుండా అన్ని వర్గాల ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని మాజీమంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట రోడ్‌షోలో పాల్గొన్న ఆయన, బండి సంజయ్ ఐదేళ్లలో కరీంనగర్ చేసిందేమీ లేదని విమర్శించారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ భాజపా కార్యకర్తల భేటిలో ఆ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ మార్ఫింగ్ వీడియోలు ప్రయోగిస్తోందని ఆక్షేపించారు. వరంగల్ జిల్లా దుగ్గొండిలో సీతారాం నాయక్‌కు మద్దతుగా కమలం కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. హనుమకొండ జిల్లా దామెరలో ఆరూరి రమేష్ ఇంటింటికి తిరుగుతూ ఓటేయాలని కోరారు. నిర్మల్‌లో కూరగాయల మార్కెట్‌లో పార్టీ అభ్యర్థి నగేష్‌తో కలిసి భాజపా శాసనసభాపక్షనేత మహేశ్వర్ రెడ్డి ప్రచారం చేపట్టారు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో భాజపా మెదక్ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పరిధిలో మజ్లిస్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతీ ఓటరును కలుస్తూ, పతంగి గుర్తుకే ఓటేయాలని కోరారు.
గ్యారంటీలు అమలు చేయకుండా గాడిద గుడ్డు చూపిస్తున్నారు : కిషన్‌రెడ్డి - lok sabha elections 2024