Locals protest against Pharma Village In Vikarabad : వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రోటిబండ తండాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా స్థానికుల ధర్నా చేపట్టారు. దుద్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్ కారు అద్దాలను స్థానికులు ధ్వంసం చేశారు. ఫార్మా విలేజ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దాడికి దిగారు.
ఫార్మా విలేజ్‌ను వ్యతిరేకిస్తూ రైతుల ధర్నా : దాడి నేపథ్యంలో పంచాయతీ భవనంలోకి శేఖర్‌ని తరలించారు. పంచాయతీ భవనంలో ఉన్న శేఖర్‌పై దాడికి నిరసనకారులు ప్రయత్నించగా పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల లాఠీఛార్జిలో పలువురు స్థానికులకు గాయాలయ్యాయి. ఫార్మా విలేజ్‌ను వ్యతిరేకిస్తూ కొందరు రైతులు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అడ్డుకున్నారు. స్థానికుల దాడిలో గాయాలైన ఆవిటి శేఖర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రజాభిప్రాయ సేకరణను అదనపు కలెక్టర్ వాయిదా వేశారు.
1700 ఎకరాల్లో ఫార్మా విలేజ్ : ఫార్మా విలేజ్‌పై మొదటి నుంచి స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పోలెపల్లి, హకీంపేట, నగచర్ల, దుద్యాల, పులిచర్లకుంట తండాలో సుమారు 1700 ఎకరాల్లో ఫార్మా విలేజ్ పేరుతో ఔషధ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాలుష్య కారకాలు వెదజల్లే పరిశ్రమలకు ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వబోమంటూ ఆయా గ్రామాల రైతులు ఆందోళనబాట పట్టారు.
ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి : ఫార్మా విలేజ్ కోసం భూముల సేకరణకు ఎంపిక చేసిన గ్రామాల్లో అంతా భూములపై ఆధారపపడి జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 10లక్షల పరిహారం, ఇంటిస్థలం, ఇళ్లు ఇస్తామని అధికారులు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఫార్మా విలేజ్ వస్తుందన్న పేరుతో తమ భూమలు రిజిస్ట్రేషన్, క్రయ విక్రయాలు జరుపుకోలేకపోతున్నామని అన్నారు. బ్యాంకులు సైతం పంటలపై రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావట్లేదని బాధపడుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులతో భూములివ్వబోమని చెప్పినట్లు రైతులు వెల్లడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా రైతుల పాదయాత్ర - ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు