Liquor Shops Allotment Process in AP : ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రశాంతంగా మునిగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలు ఉండగా అందులో 10 శాతం అంటే 345 దుకాణాలను కేవలం మహిళలే దక్కించుకున్నారు. ఈ లాటరీ ప్రక్రియ ఆయా జిల్లాల్లోని కలెక్టర్ల పరిధిలో జరిగాయి. ఈ నెల 14 ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లాటరీ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. విజయవాడ సహా కొన్ని ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు జాక్‌పాట్ కొట్టారు. అక్టోబరు 16 నుంచి వ్యాపారం చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
బీజేపీ నేతకు ఐదు మద్యం షాపులు : అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరావుకు ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని ఐదు మద్యం దుకాణాలు దక్కాయి. అలాగే అల్లూరు జిల్లాలో మొత్తంగా 40 దుకాణాలకు గానూ 1205 దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు చింతపల్లికి చెందిన వ్యక్తి 60 అప్లికేషన్లు పెట్టగా మూడు షాపులు దక్కాయి. వికలాంగుడికి మద్యం దుకాణం లాటరీలో లక్కీగా వచ్చింది. ఆ జిల్లాలో గిరిజనులకు మాత్రమే మద్యం దుకాణాలు కేటాయించగా, ఓ గిరిజనేతరుడికి దుకాణం దక్కడంతో నిబంధనల ప్రకారం రద్దు చేశారు.
తెలంగాణ వ్యక్తుల జాక్ పాట్ : ఏపీలోనే అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలోని 96వ నంబరు దుకాణానికి 132, 81వ నంబరు దుకాణానికి 110 దరఖాస్తులు, 97వ నంబరు దుకాణానికి 120 దరఖాస్తు వచ్చాయి. ఈ మూడు దుకాణాలు తెలంగాణకు చెందిన వ్యక్తులకు దక్కాయి. 96వ నంబరు దుకాణం ఖమ్మం జిల్లా ఖానాపురానికి చెందిన చెరుకుపల్లి సత్యనారాయణకు, 81వ దుకాణం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన తల్లపల్లి రాజుకు, 97వ దుకాణం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బండి అనూషకు లక్కీ ఛాన్స్ దక్కింది. విలీన మండలం కుక్కునూరులోని 121వ నంబరు దుకాణానికి వేలేరుపాడుకు చెందిన కామినేని శివకుమారికి దక్కింది.
న్యూస్ ఛానల్ ప్రతినిధులు 350 దరఖాస్తులు : వైఎస్సార్ జిల్లాలో 139 మద్యం దుకాణాలగానూ 3,257 దరఖాస్తులు వచ్చాయి. మహిళలు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధులు కమలాపురం నియోజకవర్గంలోని 4 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా దక్కించుకున్నారు. ఆ న్యూస్ ఛానల్ రాష్ట్రవ్యాప్తంగా 350 మద్యం షాపులకు దరఖాస్తు చేసినట్లు సమాచారం వస్తోంది.
మంత్రి నారాయణకు మూడు షాపులు : ఎన్నికల్లో విజయం కోసం పనిచేసిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల కోసం మంత్రి నారాయణ నెల్లూరు జిల్లాలో తన సొంత డబ్బులు రూ.2 కోట్లతో మద్యం దుకాణాలకు 100 దరఖాస్తులు వేశారు. లాటరీలో వీరికి మూడు దుకాణాలు దక్కాయి. ఒక్కో దుకాణాన్ని ఐదుగురు చొప్పున మొత్తం 15 మంది నిర్వహించే విధంగా మంత్రి నారాయణ లైసెన్సులను అందించారు.
దుకాణాలు దక్కించుకున్న మహిళలు : కృష్ణా జిల్లాలో మహిళలు లాటరీలో పాల్గొన్నారు. గుడ్లవల్లేరు, బాపులపాడు, తాడిగడప, పెనమలూరు, కృత్తివెన్నులకు చెందిన మహిళలు దుకాణాలను దక్కించుకున్నారు.
ఏపీలో మద్యం దుకాణాలకు లాటరీ ముగిసింది - విజేతలు ఎవరంటే!
మద్యం లాటరీ వచ్చిందని సంబరంగా బయటకొచ్చాడు - ఆ వెంటనే కిడ్నాప్