AP Wine Shop Tenders 2024 : రాష్ట్రంలో ఐదు సంవత్సరాల తర్వాత అమల్లోకి వచ్చిన నూతన మద్యం పాలసీ వ్యాపారుల్లో కిక్కు పెంచింది. లాటరీలో వైన్ షాప్ ఒకటి తగిలితే చాలు పరపతి పెంచుకోవచ్చనేది చాలా మంది భావన. ఆ అవకాశం దక్కించుకోవడానికి రాజకీయ నాయకుల నుంచి దిగువస్థాయి దళారుల వరకు ప్రస్తుతం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. దరఖాస్తు దాఖలుకు మరో రెండు రోజులే సమయం ఉండటంతో జిల్లాల్లో అనేక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వ్యాపార వాంఛ, రాజకీయ కాంక్షల మధ్య మధ్యవర్తులు రాయబారాలు జరుపుతున్నారు.
నేతల వారసుల జోక్యం : పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేల వారసులు మద్యం దరఖాస్తుల విషయంలో జోక్యం చేసుకుంటున్నట్లు సమాచారం. వారికి తెలియకుండా అర్జీలు చేయకూడదని హుకుం జారీ చేసినట్లు వ్యాపారులు వాపోతున్నారు. తీరప్రాంత ఎమ్మెల్యే ఒకరు కనీసం పది దుకాణాలు తనకు వదిలేయాలని కోరుతున్నారు. మరో నాయకుడు తన పరిధిలోని దుకాణాలన్నిట్లోనూ 20 శాతం వాటా అడుగుతున్నారని చెబుతున్నారు. 10 శాతానికైతే సరేనన్న సంకేతాలు మధ్యవర్తుల ద్వారా వారికి చేరాయి.
సిండికేట్లు ఏర్పాటు : గతంలో రూ.50,000 తిరిగిరాని డిపాజిట్‌గా ఉండేది. ప్రస్తుతం ఆ మొత్తం రూ.2 లక్షలకు పెరిగింది. దీంతో ఎక్కువ దరఖాస్తుల దాఖలంటే అయ్యేపనికాదని వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడుతున్నారు. సిండికేట్ నుంచి కనీసం 20 అర్జీలు తక్కువ కాకుండా వేసేందుకు సిద్ధమయ్యారు. ఏ ఒక్కరికి లాటరీలో దుకాణం వచ్చినా అందరికీ వాటాలుండేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రతిపక్ష నేతలు సిండికేట్‌లో సభ్యులవుతున్నారు.
వడ్డీలకు డబ్బుల్లేవు : వడ్డీ వ్యాపారులు సైతం జిల్లాలో పదిరోజులుగా కొత్త లావాదేవీలు నిలిపేశారు. దరఖాస్తుదారులకు ఆయా మొత్తాలు మళ్లించడంతోపాటు అధిక వడ్డీలకు వ్యాపారులు అప్పులు తీసుకెళ్లడంతో లావాదేవీలు ప్రస్తుతానికి నిలిచిపోయాయని పాలకొల్లుకు చెందిన వడ్డీ వ్యాపారి తెలిపారు.
జాతకాల జోరు : సిండికేట్ వ్యాపారుల్లో కొందరు జాతకాల ఆధారంగా దరఖాస్తులు చేస్తున్నారు. పేరు, నక్షత్రం బట్టి ఉన్నవారిలో ఎవరి జాతకం బలంగా ఉందో వారి పేరిట అర్జీ చేస్తున్నవారు ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లో ఉన్నారు. జాతకం బాగుందనిపిస్తే ఆధార్‌కార్డు, బ్యాంకు పుస్తకాలు తీసుకుని పెట్టుబడి పెట్టకపోయినా ఆ పేరుతో దరఖాస్తు చేయడానికి కొందరు సిద్ధమయ్యారు.
మద్యం దుకాణాల్లో మాకు షేర్ ఇవ్వండి - లేదా వాటిని వదిలేయండి - AP Wine Shop Tenders 2024