Liquor Department Commissioner on Beers Shortage in Telangana : తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత వాస్తవమేనని ఆబ్కారీ శాఖ కమిషనర్ శ్రీధర్ స్పష్టం చేశారు. బీర్ల కొరతపై తరచూ మీడియాలో కథనాలు వస్తుండటంతో ఆయన వివరణ ఇచ్చారు. డిమాండ్‌కు తగినట్లు రాష్ట్రంలో ఉత్పత్తి లేదని వెల్లడించారు. గడిచిన ఐదు నెలల కాలంలో నాలుగు కొత్త బ్రాండ్లకు మాత్రమే అనుమతులు ఇచ్చినట్లు వివరించారు.
'తెలంగాణ రాష్ట్రంలో ఆరు బ్రేవరీలు ఉన్నాయి. లైసెన్స్ నిబంధనల మేరకే అవి పని చేస్తాయి. వీటికి ఒక షిఫ్ట్‌లో ఉత్పత్తి చెయ్యడం కోసం అనుమతి ఉంటుంది. అయితే పెరుగుతున్న డిమాండ్ కారణంగా, బ్రేవరీల వినతి మేరకు నిర్దిష్టమైన రుసుము చెల్లింపుతో మూడు షిఫ్టుల్లో పని చేయడానికి అనుమతిస్తారు. అయితే 6 బ్రేవరీలలో కేవలం నాలుగు మాత్రమే తమ బ్రాండ్‌లతో 95 శాతం మార్కెట్ వాటాను ఆక్రమించాయి.
ఉత్పత్తి సామార్థ్యాన్ని తగ్గించి : ఆ నాలుగు బ్రేవరీలు మూడు షిఫ్టులు పని చేయడానికి అనుమతి ఉంది. అయితే ఇవి నాలుగు రోజుకు ఒక్కో షిఫ్ట్‌కు 1.66 లక్షల కేసుల లెక్కన మూడు షిఫ్ట్‌లకు 4.98 లక్షల కేసులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి, మూడు షిఫ్ట్‌ల్లో కేవలం 2.51 లక్షల కేసులను మాత్రమే తయారు చేస్తున్నారు' అని కమిషనర్ తెలిపారు.
తగ్గిన కింగ్‌ఫిషర్ బ్రాండ్ ఉత్పత్తి : రాష్ట్రంలో సాధారణంగానే లిక్కర్ కంటే బీరు వాడకం ఎక్కువ. ఇందుకు తోడు వేసవిలో బీరు వాడకం మరింత అధికంగా ఉంటుంది. ఎండాకాలం రాగానే అమ్మకాలు జోరందుకుంటాయి. రోజుకు సగటున 2 లక్షల కేసులు అమ్ముడుపోతాయి. ఇప్పటి వరకు 7.57 లక్షల కేసులు బేవరేజ్ కార్పొరేషన్ డిపోలు, బ్రేవరీస్‌లో అందుబాటులో ఉన్నాయి. కింగ్‌ఫిషర్ బ్రాండ్ డిమాండ్‌కు తగ్గట్లు ఉత్పత్తి చెయ్యడం లేదని ఆబ్కారీ శాఖ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. యాజమాన్యం తక్కువ ఉత్పత్తి చేయడం వల్ల బీర్‌కు కృత్రిమ కొరత ఏర్పడిందని వివరించారు. తగినంత నిల్వలు అందుబాటులో ఉండేలా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని వివరించారు.
కొత్త బ్రాండ్‌ల రిజిస్ట్రేషన్ ఇప్పుడు కొత్తగా వచ్చిన విధానం కాదని తెలిపారు. ఇది చాలా సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానమేనని స్పష్టం చేశారు. కొత్త సంస్థలు తమ స్టాక్‌ను స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్‌కు సరఫరా చేయడానికి అనుమతించబడతాయని, గత ఐదేళ్లలో దాదాపు 360 బ్రాండ్‌లకు అనుమతి ఉందని, గడిచిన ఐదు నెలల్లో బీర్ సరఫరా కోసం నాలుగు బీర్ బ్రాండ్లకు అనుమతించినట్లు తెలిపారు.