Liquor Bottles In Degree College : సరస్వతీ నిలయంగా భావించే కళాశాలలోనే మద్యం సీసాలు దర్శనమివ్వడం తీవ్ర కలకలం రేపింది. సాక్షాత్తు కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో ఆ మందుబాటిళ్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినులు ప్రిన్సిపల్ రూమ్‌కు తాళం వేసి ఆందోళన చేపట్టారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా బాలెంలోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో జరిగింది.
ఇదీ జరిగింది : విద్యార్థులు తెలిపిన సమాచారం ప్రకారం సూర్యాపేట జిల్లా బాలెంలలో బాలికల సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఉంది. కళాశాల ప్రిన్సిపల్‌గా శైలజ పనిచేస్తున్నారు. కళాశాలలో సమస్యలపై విద్యార్థులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడమే కాకుండా తమపై వేధింపులకు గురిచేస్తుందని వారు మండిపడ్డారు.
Liquor Bottles Found AT Principal Room : సహాయ కేర్ టేకర్ సౌమిత్రితో కలిసి ప్రిన్సిపల్ అర్ధరాత్రి వేళ మద్యం సేవిస్తూ విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విద్యార్థులు ఆరోపించారు. ప్రిన్సిపల్ కార్యాలయంలో మద్యం సీసాల విషయం తెలుసుకున్న విద్యార్థినులు ఆ రూమ్‌కు తాళం వేశారు. అక్కడే ఉన్నకేర్ టేకర్‌ను ఈ విషయమై నిలదీశారు.
ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ : తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి ప్రిన్సిపల్‌ను ఆమెకు సహాకరిస్తున్న కేర్‌టేకర్‌ను విధుల నుంచి తొలగించాలని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. విద్యార్థినులు వ్యతిరేకతను గమనించిన కేర్‌టేకర్ వారి దృష్టిని మరల్చేందుకు ఆత్మహత్యాయత్నం చేయగా సిబ్బంది, స్టూడెంట్స్ అడ్డుకున్నారు.
కళాశాలను తనిఖీ చేసిన అధికారులు : సమాచారమందుకున్న స్థానిక ఆర్డీవో వేణు మాధవ్‌రావు, డీఎస్పీ రవి, కళాశాలల ఆర్సీవో అరుణ కుమారి, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి లత కళాశాలకు చేరుకుని వాస్తవాలు విచారించారు. తమకు న్యాయం చేయాలని అధికారులతో విద్యార్థినులు మొరపెట్టుకున్నారు. మద్యం సీసాల వ్యవహారాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు అధికారులు హామీ ఇచ్చారు. విచారణ అనంతరం ప్రిన్సిపల్ శైలజను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.
Liquor in School Telangana : స్కూల్లో ఫూటుగా మందుకొట్టి.. టీచర్‌పై నిందనెట్టి.. చివరకు..?