Water Crisis in India : దేశానికి రాజధాని. యావత్ భారతదేశ పాలనకు ముఖ్య కేంద్రం. అయినా ఏం లాభం. కనీస అవసరమైన నీటి కోసం అల్లాడాల్సిన పరిస్థితి. గత 15రోజులుగా ఇదే పరిస్థితి. దిల్లీకి మంచినీరు అందించే నీటి వనరుల్లో నిల్వలు తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం. దీనికి తోడు దిల్లీ సహా ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో ఎండలు తగ్గకపోవడం సమస్యను మరింత పెంచింది. వేసవి ముగిసి 15రోజులు కావస్తున్నా దిల్లీలో 45నుంచి 47డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
విద్యార్థులు భద్రమేనా- స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై స్పెషల్ స్టోరీ - school bus fitness
దీంతో వర్షాలు లేక, నల్లానీరు రాక ప్రజలు చుక్కనీటి కోసం సతమతం కావాల్సిన దుస్థితి ఏర్పడింది. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా అవి అరకొరగానే ఉంటున్నాయి. వీధిలోకి నీటి ట్యాంకర్ వస్తే దాని చుట్టూ ఎగబడి నీటిని తీసుకుంటున్న దృశ్యాలు దిల్లీలో అనేకం. ఒక్క బకెట్ నీరు దొరికినా చాలు అన్నట్లు ప్రజలు ట్యాంకర్ల చుట్టూ చేరడం అక్కడి దీనస్థితికి అద్దం పడుతోంది.
సుప్రీంకోర్టు ఆగ్రహాం.. దిల్లీకి నీటిని ప్రధానంగా యమునా నది నుంచి తీసుకుని, శుద్ధి చేసిన తర్వాత సరఫరా చేస్తారు. అయితే యమునలో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. మ్యూనక్ కాలువ కూడా దిల్లీ నీటి అవసరాలను తీరుస్తోంది. వేసవి కావడంతో ఈ కాలువలో నీటి నిల్వలు తగ్గిపోయాయి. ఉన్న కొద్దిపాటి నీటిని కూడా ట్యాంకర్ మాఫియా అక్రమంగా తీసుకుంటోంది. ట్యాంకర్ మాఫియా ఆగడాలపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మాఫియా నీటిని మింగేస్తోందని, దీన్ని అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారని దిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
బెంగళూరు, దిల్లీ లాంటి ప్రాంతాల్లో నీటి కొరతకు అనేక కారణాలు ఉన్నాయి. నీటికి ప్రధాన ఆధారమైన వర్షాలు కురవకపోవడం అందులో మొదటి కారణం. ఈ కారణంగా జలాశయాల్లో నీరు అడుగంటి ప్రజలకు తగినంత సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి మనుషులు చేసే లెక్కకు మిక్కిలి తప్పులు కూడా దీనికి తోడవుతున్నాయి. అడ్డూఅదుపూ లేకుండా భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడడంతో అవి అడుగంటాయి. ఎన్ని వేల అడుగులు తవ్వినా చుక్కనీరు రాని పరిస్థితి ఏర్పడింది.
కొరవడిన అవగాహన.. పట్టణీకరణ, జనాభా పెరుగుదల మరో కారణం. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున నగరాలు, పట్టణాలకు వస్తూ ఉండడంతో వారి అవసరాలకు నీరు సరిపోక కొరత ఏర్పడుతోంది. పట్టణాల్లో నిర్మాణాల కోసం చెరువులు, కుంటలు వంటి నీటి వనరులను పూడ్చడంతో వాటి జాడ లేకుండా పోతోంది. ఉన్న కొద్ది పాటి జల వనరులు సైతం కలుషితంగా మారడంతో నగరాలు, పట్టణాల్లో నీటికి కొరత ఏర్పడుతోంది. నీటిని వృధా చేయడం, వర్షపు నీటిని పొదుపు చేయాలన్న విషయాలపై అవగాహన లేకపోవడం వల్ల కొరత ఏర్పడినపుడు అవసరాలు తీరే మార్గం కనిపించడం లేదు.
ఐక్యరాజ్యసమితి నీటి అభివృద్ధి నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 26శాతం ప్రజలు సురక్షిత తాగునీటికి దూరంగా ఉన్నారు. నీటి కొరత ఒక ప్రాంతానికి, దేశానికి పరిమితమైన సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా 4వందల కోట్ల మంది ప్రజలు ఏడాదిలో ఒక రోజు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశాలు ఆర్థికంగానూ నష్టపోతాయని ప్రపంచ నీటి కొరత ముప్పు సంస్థ అట్లాస్ ఇటీవల హెచ్చరించింది. ప్రపంచ జీడీపీలో అది 31శాతం ఉంటుందని తెలిపింది.
వ్యవసాయరంగానికే సింహాభాగం.. ఇందులో సగం వాటా భారత్, మెక్సికో, ఈజిప్టు, తుర్కియే నుంచే కోల్పోతుతందని తెలిపింది. ప్రపంచ జనాభాలో 18శాతం వాటా కల్గిన భారత్, నీటి వనరుల విషయంలో మాత్రం 4శాతానికే పరిమితమైంది. భారతదేశంలో సమకూరుతున్న నీటిలో 85శాతం నుంచి 90శాతం వ్యవసాయానికి, మిగతా నీరు పరిశ్రమలు, తాగునీరు, గృహ అవసరాలకు వినియోగిస్తున్నారు. ప్రపంచంలో వ్యవసాయానికి అత్యధిక నీరు వినియోగిస్తున్న దేశం భారతదేశమే. ఆహార ఉత్పత్తుల్లో అగ్రభాగంలో ఉన్న అమెరికా, చైనా, బ్రెజిల్ కంటే కూడా భారత్ ఎక్కువ నీటిని వ్యవసాయానికి వాడుతోంది. దేశంలో వ్యవసాయం కోసం వినియోగిస్తున్న నీటిలో 90శాతం బోరుబావుల తోడుతున్నారు. దీంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి.
బెంగళూరు, దిల్లీ లాంటి అనుభవాలు దేశంలో తరచూ ఏర్పడుతున్నా నీటి సంరక్షణ విషయంలో ప్రభుత్వ యంత్రాంగాలు, ప్రజలు పాఠాలు నేర్చుకోని పరిస్థితి. విచ్చలవిడి వాడకం, చెరువులు, కుంటల ఆక్రమణ, నీటి కాలుష్యం సహా ఉన్న నీటిని పొదుపు చేయలేక సమస్యలను కొనితెచ్చుకుంటున్న పరిస్థితి. వాననీటిని ఒడిసి పట్టడం, ఇంకుడు గుంతలు అంటూ కార్యక్రమాలు చేపడుతున్నా అవి నామమాత్రంగానే ఉంటున్నాయి.
వ్యవసాయంలో నీటి వాడకాన్ని తగ్గించడానికి బిందు సేద్యం, సాంకేతికత వంటి విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని అవలంబించడం ద్వారా నీటి వినియోగాన్ని 45శాతం తగ్గించడం ద్వారా పెట్టుబడి ఖర్చులు ఆదా చేసుకుని దిగుబడి పెంచుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా రైతులను ప్రోత్సహించేవారు లేకుండా పోయారు. అందువల్ల నీటి సంరక్షణ, పొదుపు విషయంలో తక్షణమే మేలుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే దిల్లీ, బెంగళూరు లాంటి నీటి కొరత అనుభవం దేశంలోని మరిన్ని ప్రాంతాల్లో చవిచూడక తప్పదు.
హెచ్చరిక : మహిళల గర్భాశయంపై మొబైల్ ఎఫెక్ట్ - ఏం జరుగుతుందో తెలుసా? - Side Effects of Mobile Phones