Police on Social Media Crazy Antics : సోషల్ మీడియా మోజులో పడిన నేటి యువతరం రోజురోజుకు బరితెగిస్తున్నారు. రీల్స్, యూట్యూబ్ షాట్స్‌పై పిచ్చి పీక్స్‌కు పోయి లైకుల కోసం ఆరాటపడుతూ ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. మరికొందరైతే ఇతరులకు ఇబ్బంది కలిగించేలా రద్దీ రోడ్లపై అడ్డగోలుగా రీల్స్ చేస్తూ, జన సమ్మర్థ ప్రాంతాల్లో అసౌకర్యం కలిగిస్తున్నారు. ప్రజలకు ఎంత ఇబ్బంది కలిగినా, అడ్డగోలుగా రీల్స్ చేసేస్తాం, ఒక్కరోజులో పాపులర్ అయిపోతామంటే ఇక నుంచి కుదరదు. రీల్స్ చేసేటప్పుడు హద్దు దాటి ప్రవర్తించినా, ప్రజలకు ఇబ్బంది కలిగినా జైలు ఊసలు లెక్కపెట్టాల్సిందే.
సోషల్ మీడియా ఫాలోవర్లను పెంచుకోవడానికి, సెలెబ్రిటీలుగా మారడానికి జన సమ్మర్థ ప్రాంతాల్లో అసౌకర్యం కలిగేలా వీడియోలు చిత్రీకరిస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమ అకౌంట్లు తనిఖీ చేసి పాతవాటిపైనా కేసులు పెడుతున్నారు. ఇటీవల నడిరోడ్డుపై నోట్లు వెదజల్లుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసిన యువకుడిపై కూకట్‌పల్లి, సనత్‌నగర్, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
కుర్రకారు వెక్కిలి చేష్ఠలతో బైక్‌పై స్టంట్లు, డ్యాన్సులు : ప్రముఖుల మాదిరి తాము కూడా సెలబ్రిటీలుగా మారిపోవాలని లేదా ఫాలోవర్లను పెంచుకోవాలనే ఆరాటంతో కొందరు యువత తప్పుదోవ పడుతున్నారు. ఇంకొందరు లైకులు, ఫాలోవర్లు పెంచుకోవడానికి అడ్డగోలు షార్ట్ రీల్స్ చేస్తున్నారు. తమ ప్రత్యేకత చాటుకోవాలనే భావనతో రద్దీ రోడ్లపై బైకుపై స్టంట్లు వేయడం, డ్యాన్సులు, ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రాంక్ వీడియోలు చేయడం, వాహనాల్లో ప్రయాణిస్తూ డబ్బులను గాల్లోకి ఎగరేస్తూ వీడియోలు చిత్రీకరిస్తున్నారు.
క్రిమినల్ కేసులు నమోదు : సామాజిక మాధ్యమాల్లో రీల్స్/ వీడియోల కోసం ప్రజలకు ఇబ్బంది కల్గిస్తే చట్టప్రకారం చర్యలుంటాయని కూకట్‌పల్లి ఏసీపీ కె.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బైకుతో స్టంట్లు చేయడం, నోట్లు వెదజల్లడం, అభ్యంతరంగా ఉండడం వంటి ఇతరత్రా వీడియోలు చిత్రీకరిస్తే బాధ్యులను గుర్తించి కేసులు నమోదు చేస్తామని తెలుపుతున్నారు.
తల్లిదండ్రులూ గమనించాల్సిందే :
- పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో కచ్చితంగా గమనించాలి.
- పిల్లలకు మొబైల్ ఇచ్చాక దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో పర్యవేక్షించాలి.
- సామాజిక మాధ్యమ అకౌంట్ ప్రొఫైళ్లను తనిఖీ చేస్తుండాలి.
- 15- 25 ఏళ్ల యువత ఎక్కువగా అభ్యంతరకరంగా వీడియోలు, ఫొటోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. వీరిపై ఎక్కువ దృష్టి సారించాలి.
- కేసులు నమోతైతే భవిష్యత్‌లో ఇబ్బందులు ఉంటాయని హెచ్చరించాలి.