Land Grabbers Occupying Lakkakunta Kasaram Pond : రాష్ట్రంలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. అందిన కాడికి రిజిస్ట్రేషన్ల పేరుతో ఖాళీ స్థలాలను సైతం వదలడం లేదు. కబ్జాదారుల ఆకలికి చెరువులు పూడ్చేసి వెంచర్ల కోసం ఉపయోగ పడుతుందనే ఆలోచనతో ఆక్రమిస్తున్నారు. వానాకాలంలోనూ లక్కకుంట కాసారం చెరువు నీళ్లుండవు. ఆ చెరువును మూసేస్తే భవిష్యత్తులో వెంచర్లకు ఉపయోగపడుతుందన్న ముందస్తు ఆలోచనతో కొందరు అక్రమార్కులు హైదరాబాద్లోని దుండిగల్ మండలంలోని లక్కకుంట చెరువును(Lakkakunta Kasaram Pond) మట్టితో కప్పేస్తున్నారు. 3 నెలల నుంచి కొందరు ప్రైవేటు వ్యక్తులు లారీలు, టిప్పర్లతో నింపేస్తున్నారు.
Illegal excavations: యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాల దందా..!
గ్రామ నక్షా(పటం)లో నీటి వనరుగా వర్గీకరించినా చెరువుకు సమీపంలో కొందరికి చెందిన ప్రైవేటు పట్టాలు ఉండటంతో పథకం ప్రకారం ఆక్రమిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎకరా విలువ రూ.10 కోట్లు ఉందని, ఈ లెక్కన 8.30 ఎకరాల విస్తీర్ణమున్న చెరువు విలువ రూ.83 కోట్లు ఉంటుందని అంటున్నారు. చెరువు సమీపంలోకి ఎవరూ రాకుండా ప్రైవేటు సైన్యాన్ని మోహరించారు. 3 నెలల నుంచి చెరువును పూడ్చేస్తున్నా, అధికారులు లక్కకుంట చెరువు వైపు కన్నెత్తి చూడడం లేదు.
రియల్ వెంచర్లతో సొమ్ము కూడబెట్టుకునేందుకు
దుండిగల్ మండలం గాగిల్లాపూర్ సర్వే నంబర్ 237లో లక్కకుంట చెరువు ఉందని సర్వే రికార్డు చెబుతుంది. ఈ చెరువుకు సమీపంలో కొన్ని ప్రైవేటు పట్టా భూములున్నాయి. సమీపంలో రియల్ వెంచర్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. గాగిల్లాపూర్ గ్రామానికి రెండు, మూడు కిలోమీటర్లలోపునే అపార్ట్‌మెంట్లు నిర్మాణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమార్కులు చెరువును మింగేస్తున్నారు. లక్కకుంటను నీటి వనరుగా ఉన్నందున పర్యవేక్షణ బాధ్యత ఇరిగేషన్ అధికారులదేనని రెవెన్యూ అధికారులు అంటున్నారు.
చేతులు మారిన జాగీర్, భూదాన్ భూములు.. చర్యలకు 'సిన్హా' సిఫార్సు
ఇరిగేషన్ పరిధిలోది కాదు రెవెన్యూదే
భూములపై అన్ని హక్కులతో పాటు మండల స్థాయిలో నిర్మాణాల అనుమతులు రెవెన్యూ అధికారులు ఇస్తున్నందున ఆక్రమణలు, కూల్చివేతలు వారికే సంబంధమని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. ఎవరికి వారు సంబంధం లేదని పట్టించుకోవడం మానేస్తే, చెరువు మాయమవడం ఖాయమని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయమై దుండిగల్ తహసీల్దార్ సుచరిత, మేడ్చల్ జిల్లా ఇరిగేషన్ డీఈఈ శ్రీనివాసమూర్తిని వివరణ కోరగా, మట్టిని నింపుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.