Bonalu Festival in Hyderabad : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం బోనాల సందడి ప్రారంభమైంది. ఈ క్రమంలో లాల్‌దర్వాజ బోనాల వేడుకను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అలాగే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్రమంత్రి బండి సంజయ్, బండారు దత్రాత్రేయ దర్శించుకున్నారు. మరోవైపు అంబర్‌పేటలోని మహంకాళీ అమ్మవారికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.
పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభీక్షంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. కోవిడ్ సమయంలో మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని కోరుకున్నారని, ఆ సమయంలో ప్రజలందరి మీద తల్లి ఆశీస్సులున్నాయని చెప్పారు. గతేడాది వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలని, పాడి పంటలతో ప్రజలంతా ఆనందంగా జీవించాలని కోరుకున్నట్లు చెప్పారు.
"అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డిజైన్‌తో కొత్త ఉస్మానియా దవాఖానాను నిర్మిస్తాం. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నాము. పాతబస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నాము. హైదరాబాద్ నగర అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాము. - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి
మేడిగడ్డ బ్యారేజీ కుంగడంలో కుట్ర ఉందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించాలని విలేకర్లు ప్రశ్న అడగ్గా దేవాలయం దగ్గర రాజకీయాలు మాట్లాడటం భావ్యం కాదని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది కేటీఆరే కదా అన్న ఆయన, కుట్రలు చేస్తే డ్యాం లోపలికి ఎలా కుంగుతుందని ప్రశ్నించారు. పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు, మొత్తం తెలంగాణ ప్రజలకు బోనాల పండగ శుభాకాంక్షలను కేంద్రమంత్రి బండి సంజయ్ తెలియజేశారు.