Lack of Infrastructure Facilities in Vizianagaram District : నగరంలో ప్రారంభించిన రోడ్లన్నీ పూర్తి చేశాం. ప్రధాన మార్గాలను విస్తరించి కూడళ్లను సుందరీకరించాం. నగరవాసుల ఆహ్లాదం కోసం ఉద్యాన వనాలూ ఏర్పాటు చేశాం. విజయనగరం అభివృద్ధిపై ప్రతి వేదికపైనా వైసీపీ నాయకులు చెప్పుకుంటున్న గొప్పలివి. వాస్తవ పరిస్థితులు మాత్రం దానికి పూర్తి భిన్నంగా దర్శనమిస్తున్నాయి. విజయనగర నగరపాలక సంస్థలోని విలీన పంచాయతీలు, శివారు కాలనీల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది.
సమస్యలకు నిలయంగా జగనన్న కాలనీలు-మౌలిక సదుపాయాలు కల్పించాలని లబ్ధిదారుల విజ్ఞప్తి
2013లో విజయనగరం మున్సిపాలిటీని నగరపాలక సంస్థగా మార్చారు. ఈ క్రమంలో గాజులరేగ, వేణుగోపాల్ నగర్, అయ్యన్నపేట, జమ్ము, కె.ఎల్.పురం, ధర్మపురి, కణపాక గ్రామాలను విజయనగరంలో విలీనం చేశారు. విలీనంపై అప్పట్లో ఆయా గ్రామాల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైనా కనీసం సమస్యలైనా తీరతాయని స్థానికులు ఆశించారు. అయితే ఉన్న సమస్యలు తీరకపోగా కొత్తగా తాగునీటికి ఇబ్బందులు మొదలయ్యాయని గ్రామస్థులు వాపోతున్నారు. నగరపాలక సంస్థలోకి విలీనమైన పంచాయతీల్లో ఇప్పటికీ మౌలిక వసతులు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగనన్న కాలనీల పేరిట మోసం - వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెపుతామన్న లబ్ధిదారులు
కార్పొరేషన్ పరిధిలోని అయ్యన్నపేట, శిర్డీ సాయినగర్, సూర్యానగర్, మారుతీనగర్, సాగర్ నగర్, అష్టలక్ష్మి కోవెల దారి, రాజవీధి, కరకవలసి కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ అధ్వానంగా ఉండడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. దోమలు, పందుల సంచారంతో ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ల ట్యాంకు శిథిలావస్థకు చేరినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. శివారు కాలనీల్లోనూ పలుచోట్ల రహదారులు అధ్వానంగా మారాయి. విజ్జీ స్టేడియం నుంచి దాసన్నపేట మార్గంలో రాజానగర్ రహదారి రాళ్లు తేలి వాహన చోదకులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. సింగపూర్ సిటీ ప్రాంతంలోని పలు కాలనీల్లో డ్రైనేజీలు నిర్మించకపోవడంతో మురుగు సమస్య వేధిస్తోంది. నీటి సరఫరా సైతం అంతంత మాత్రంగానే ఉండడంతో గోతుల్లో దిగి తాగునీరు పట్టుకోవాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయిదేళ్ల వైసీపీ పాలనలో విలీన ప్రాంతాలు, శివారు కాలనీల్లో పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయని సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అధికారంలోకి రానున్న పాలకులైనా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
తాగునీటి సమస్య తీర్చాలంటూ మున్సిపల్ ఆఫీసుకు తాళం - అధికారులు దళిత ద్రోహులుగా మారారంటూ ఆగ్రహం