Govt Pharmacy College Karimnagar Problems : కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యను అందిస్తామని ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అధ్వానంగా ఉంది. పాఠశాలలే కాదు విశ్వవిద్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కరీంనగర్ శాతవాహన వర్సిటీకి అనుబంధంగా ఉన్న ఫార్మసీ కళాశాలలలో మౌలిక సదుపాయాలు కరవై అరకొర వసతులు మధ్య విద్యార్థులు చదువుకొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది.
రేకుల షెడ్లే తరగతి గదులు : కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం వద్ద ఉన్న ఫార్మసీ కళాశాల, వసతి గృహం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. లోయర్ మానేరు డ్యాం సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ క్వార్టర్లలో కళాశాలను నిర్వహిస్తున్నారు. రేకుల షెడ్లకు థర్మకోల్ అలంకరించి తరగతి గదులుగా మార్చేశారు. శాతవాహన వర్సిటీకి అనుబంధంగా ఉన్న ఈ కళాశాల 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చదువుకునేందుకు విద్యార్థులు వస్తారు. కళాశాల సామర్ధ్యం 240 కాగా ఇక్కడి స్థితిగతులను చూసి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇందులో చేర్పించడం లేదు. దీంతో కళాశాలలో విద్యార్థుల సంఖ్య 160 కే పరిమితమైంది.
కనీస వసతులకు నోచుకోని దయనీయ పరిస్థతి : కళాశాలలో మౌలిక వసతులు లేవని విద్యార్థులు వాపోతున్నారు. కళాశాల చుట్టు ప్రహరీగోడ లేకపోవడంతో కనీస రక్షణ కరవైందని విద్యార్ధినిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా తాము పడుతున్న బాధను అధికారులకు చెబుతున్నా పరిష్కారం మాత్రం కావడం లేదంటున్నారు. హాస్టల్ గదుల్లోకి పాములు, కీటకాలు వస్తుంటాయని దీంతో భయం భయంగా గడపాల్సి వస్తోందని విద్యార్థులు అంటున్నారు.
నగరానికి దూరంగా ఉన్న ఫార్మసీ కళాశాలలో కనీసం వాహన సదుపాయం లేదని రాత్రి వేళల్లో ఆరోగ్య సమస్యలు వస్తే తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో సరైన తరగతి గదులు, పరిశోధనలు చేసేందుకు సరైన ల్యాబ్ సౌకర్యం లేదని విద్యార్థులు చెబుతున్నారు.
"ఈ కళాశాలలో కనీస వసతులైన తరగతి గదులు, మెస్, రోడ్లు, వసతి గృహం సరిగా లేవు. ప్రయోగశాలలో పరికరాలు లేకపోవడం వల్ల మాకు ప్రాక్టికల్స్ చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. రూంలలోకి పాములు, కీటకాలు, దుర్వాసన వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గ్రంథాలయంలో పుస్తకాలు కూడా తగినంతగా లేవు. 150 మందికి ఉన్నవి 4 మరుగుదొడ్లు ఉన్నవి" - విద్యార్థులు
మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడతాం : కేంద్రప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉన్నాయని వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని వర్సిటీ రిజిస్టార్ వరప్రసాద్ చెబుతున్నారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కళాశాలలో కొత్త భవన నిర్మాణంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.
రోడ్డుపై బైఠాయించిన నిజాం కళాశాల విద్యార్థినులు - వసతి గృహంలో సదుపాయాలు కల్పించాలని డిమాండ్