Kuwait Victim Daughter Appeal: తన తండ్రి కువైట్లో కష్టాలు పడుతున్నాడంటూ 11 ఏళ్ల చిన్నారి కన్నీటి పర్యంతమైంది. ప్రభుత్వ పెద్దలు స్పందించి తన తండ్రిని విడిపించాలని వేడుకుంది. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి బీసీ కాలనీకి చెందిన శివ కువైట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఓ సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపించాడు.
ఎడారిలో గొర్రెలు మేకలు, కుక్కలు, కోళ్లు, బాతులు, పావురాలకు కాపలాగా పెట్టినట్లు అందులో పేర్కొన్నాడు. చుట్టుపక్కల కనుచూపు మేరలో ఎవరూ లేరన్నారు. మొత్తం పని అంతా తానొక్కడితోనే చేపిస్తున్నారని, నిద్రాహారాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎడారిలో విష సర్పాలు అధికంగా ఉన్నాయని, చనిపోయినా ఎవరు పట్టించుకునే వారు లేరని కన్నీటి పర్యంతమయ్యాడు.
దయచేసి ఎవరైనా సాయం చేసి ఈ ఎడారి నుంచి తనను స్వదేశానికి తీసుకెళ్లాలని వీడియోలో పేర్కొన్నాడు. లేకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని అన్నాడు. తన బిడ్డలు గుర్తొస్తున్నారని, దయచేసి ఎవరైనా సహాయం చేయాలని వేడుకున్నాడు. స్వదేశానికి తీసుకెళ్లాలని ఏజెంట్‌కి చెబితే, అదనంగా డబ్బు చెల్లించాలని చెబుతున్నాడని పేర్కొన్నాడు. అయితే అంత డబ్బు తన దగ్గర లేదని విలపించాడు. ఏజెంట్ తనను కువైట్‌కి తీసుకెళ్లేటప్పుడు చెప్పిన పని ఒకటి, ఇక్కడకు వచ్చాక చేపిస్తున్న పని మరొకటి అని బోరుమన్నాడు. ఎవరైనా తనను కాపాడాలని ప్రాధేయ పడ్డాడు.
Imran stuck in Dubai: చిత్రహింసలు పెడుతున్నారు రక్షించండి.. దుబాయ్‌లో ఆదోని యువకుడి ఆవేదన
చిత్తూరు జిల్లా కల్లూరుకు చెందిన శివ 18 ఏళ్ల కిందట చింతపర్తికి వచ్చి శంకరమ్మను పెళ్లి చేసుకుని, ఇక్కడే అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. శివ భార్య శంకరమ్మ, పెద్ద కుమార్తె ప్రతిరోజు వ్యవసాయ పనులకు కూలీలుగా వెళుతున్నారు. కూలి చేస్తే గానీ పూట గడవని కుటుంబం వీరిది.
ఇలాంటి నేపథ్యంలో కుమార్తెలను చదివించడానికి, పెళ్లి చేసేందుకు రాయచోటికి చెందిన ఓ ఏజెంట్ ద్వారా ఇటీవల శివ కువైట్‌కి వెళ్లాడు. అయితే అక్కడ అతను చెప్పిన పని కాకుండా మరొక కష్టమైన పని చేపిస్తూ ఎడారిలో ఇబ్బందులు పడుతుండడంతో, సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. కువైట్లో తన తండ్రి ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి చిన్న కుమార్తె కన్నీటిపర్యంతమయింది. అధికారులు స్పందించి తమ తండ్రిని స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటోంది.
LOKESH ON KUWAIT VICTIM: మరోవైపు కువైట్‌లో వేధింపులకు గురై దుర్భర జీవితం గడుపుతున్నామన్న శివ వీడియోపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ బాధితుడు సామాజిక మాధ్యమంలో వీడియో పోస్ట్ చేశాడు. వీడియోలోని వ్యక్తిని గుర్తించామని, తెలుగుదేశం ఎన్ఆర్ఐ బృందం ఆయనను చేరుకుందని మంత్రి తెలిపారు. కేంద్ర సహకారంతో బాధితున్ని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.