Yong Woman Got Six Gold Medals in Kurnool : పానీపూరి అమ్ముతూ తన ఇద్దరూ పిల్లలను చదివించాడు ఈ తండ్రి. నాన్న పడుతున్న కష్టం చూసి పట్టుదలతో చదువుల్లో రాణిస్తోంది ఈ యువతి. ప్రతిభతో ఉచిత విద్యావకాశాలు అందుకుని బీఎస్సీ అగ్రికల్చర్ చేసింది. కోర్సులో సత్తా చాటి కళాశాలకే పేరు తీసుకొచ్చింది. ఇటీవల జరిగిన వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా డిగ్రీ పట్టా సహా బంగారు పతకాలు అందుకుంది ఈ అమ్మాయి.
ఈ యువతి పేరు కోమల్ ప్రియ. కర్నూలు నగరంలోని గాయత్రీ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన మిట్టా సురేంద్ర, సరస్వతిల కుమార్తె. దంపతులిద్దరూ పానీపూరీ అమ్ముతారు. తల్లిదండ్రుల కష్టం చూసి చదువుల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది ఈ అమ్మాయి. డాక్టర్ కావాలని కలలు కన్నా నీట్‌లో మంచి ర్యాంక్ రాలేదు. దీంతో బీఎస్సీ అగ్రికల్చర్‌లో ఉచిత సీట్ సాధించి మహానందిలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలలో చేరింది.
"డాక్టర్ అవుదామని కోరిక ఉండేది. ఎలా అయినా సరే డాక్టర్ అవ్వాలని అగ్రికల్చర్ కోర్సులో చేరాను. ప్రతి సంవత్సరం అంగ్రూ యూనివర్సిటీ వారు ఆరుగురిని ఎంపిక చేసి ఇంటర్నేషనల్ ట్రైనింగ్‌కి పంపిచేవారు. ఆ విషయం నాకు సీనియర్స్ ద్వారా తెలిసింది. ఆ కోరికతో చదవడం ప్రారంభించాను." - కోమల్ ప్రియ, వ్యవసాయ విద్యార్థిని
Komal Priya 6 Gold Medals : చదువులో మొదటి ఏడాది నుంచే అద్భుత ప్రతిభ చూపింది కోమల్ ప్రియ. నాలుగేళ్ల పాటు సగటున 9.15 జీపీఏ సాధించి యూనివర్సిటీ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ఆరు బంగారు పతకాలు సాధించింది. వర్సిటీ టాపర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సబ్జెక్ట్‌లో టాప్ ర్యాంక్, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీలో అత్యధిక జీపీఏ ఇలా మెుత్తం 6 విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు చెబుతోంది.
కీటకశాస్త్ర విభాగంలో పరిశోధనలు : బీఎస్సీ పూర్తయ్యాక ఎంఎస్సీ అగ్రికల్చర్ కోసం రాసిన ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో 27వ ర్యాంకు సాధించింది కోమల్ ప్రియ. దిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్‌లో సీటు సంపాదించింది. రెండేళ్లలో కీటకశాస్త్ర విభాగంలో పరిశోధనలు చేసింది. ఇటీవలే పీహెచ్‌డీ కోసం ప్రవేశ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తోంది.
రైతులకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యం : చీడపీడల నివారణ కోసం ఇటీవల విపరీతంగా పురుగు మందులు పిచికారి చేస్తున్నారు రైతులు. దీని వల్ల పెట్టుబడుల ఖర్చు పెరుగుతోంది. మరోవైపు పర్యావరణానికి, ప్రజల ప్రాణాలకు ఎంతో హాని కలుగుతోంది. రైతులకు ఖర్చు తగ్గించటం సహా పర్యావరణానికి మేలు చేసే విధంగా పురుగుల నివారణకై ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తానని చెబుతోంది కోమల్ ప్రియ. అమ్మాయిలు వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడాలనే ఉద్దేశ్యంతో ముందు నుంచే చదువుకునేందుకు ప్రోత్సహించామని చెబుతున్నారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు.
తమ నమ్మకాన్ని నిలబెడుతూ వారు మెరుగ్గా రాణిస్తుంటే చాలా ఆనందంగా ఉందంటుని కోమల్ ప్రియ తల్లిదండ్రులు అంటున్నారు. అమ్మానాన్నలకు చేదోడు వాదోడుగా ఉంటూనే చదువుల్లో రాణిస్తోంది కోమల్ ప్రియ. చదువు కోసం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూనే వర్సిటీ స్థాయిలో రికార్డు సృష్టించింది. భవిష్యత్‌లో ఉన్నత చదువులు చదివి దేశాభివృద్ధికి తన వంతు సాయపడతానని ధీమాగా చెబుతోంది.