KTR Sensational Tweet on PM Modi : ప్రధాని నరేంద్రమోదీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నా, కేంద్ర ఎన్నికల సంఘం స్పందించడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. పీఎం వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించిన కేటీఆర్, ప్రధాని చట్టం కంటే గొప్పవారా? ఈసీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇలాగైతే ఎన్నికలు స్వేచ్చగా, పారదర్శకంగా ఎలా జరుగుతాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
అటు మహిళల విషయంలో కాషాయ పార్టీ వైఖరిని తప్పుపట్టిన ఆయన, మణిపూర్‌లో మహిళలపై ఆకృత్యాలు పట్టించుకోరని, బిల్కిస్ బానో కేసులో సంస్కారి రేపిస్టులు అని విడుదల చేస్తారని ఆరోపించారు. మహిళా రెజ్లర్ల ఆందోళనను పట్టించుకోరన్న కేటీఆర్, వారి ఆందోళనలను లెక్క చేయకుండా బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్ ఇవ్వడమే బీజేపీ విధానమని మండిపడ్డారు.
భేటీ బచావోను ప్రోత్సహించే బీజేపీ విధానం ఇదేనా : బ్రిజ్ బిషన్ కుమారుడు కరణ్‌కు కైసర్‌గంజ్ పార్టీ టికెట్ కేటాయించిన వార్త క్లిప్‌ను కేటీఆర్ ట్వీట్‌కు జత చేశారు. అదే విధంగా తీవ్ర లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్న కోసం ప్రధాని కర్ణాటకలో ప్రచారం చేసిన విషయాన్ని వ్యాఖ్యానించి, దానిపై ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. భేటీ బచావోను ప్రోత్సహించే బీజేపీ విధానం ఇదేనా అని కేటీఆర్ ప్రశ్నించారు.
KTR Response to Padma Shri Moguliah : మరోవైపు పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర వాయిద్య కళాకారులు దర్శనం మొగులయ్య కూలీ పనిచేసుకుంటున్నారన్న కథనాలపైనా కేటీఆర్ స్పందించారు. మొగులయ్య కుటుంబ బాగోగులు వ్యక్తిగతంగా తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. వెంటనే తన టీం సభ్యులు అతని వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుంటారని చెప్పారు. కాగా ఈ వార్తను తన దృష్టికి తెచ్చినందుకు సుచేతా దలాల్‌కు ధన్యవాదాలు తెలిపారు.
మొగులయ్య హైదరాబాద్ పట్టణ సమీపంలోని తుర్కయమంజాల్‌లో ఓ నిర్మాణ స్థలంలో కూలీగా పని చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. ఆయన పొట్టకూటికోసం కూలి పనులకు వెళ్తున్నట్టు చెప్పుకొచ్చారు. తనకు గత ప్రభుత్వం ఇస్తున్న నెలవారి గౌరవ వేతనం ఆగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.